23-07-2025 12:00:00 AM
నాగార్జునసాగర్, జూలై 22: జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి లక్షకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం చేరుకుంటుండంతో మంగళవారం అధికారులు గేట్లు ఎత్తి, సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఈ సీజన్‌లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది రెండోసారి. జూరాల నుంచి 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మ ట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులుగా ఉంది.
జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలుకాగా, ప్రస్తుత నీటినిల్వ 208 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,346 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది.
నాగార్జున సాగర్ నీటిమట్టం గత 22 రోజుల్లోనే 55 అడుగుల మేర పెరగడం విశేషం. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుకాగా ప్రస్తుతం 570 అడుగులకు చేరుకుంది. మ రో 20అడుగులు పెరిగితే.. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోనుంది. అటు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టిఎంసిలు కాగా ప్రస్తుతం 256టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
మరో 50 టీఎంసీలు సాగర్ ప్రాజెక్టులోకి చేరితే.. గేట్లు ఎత్తి దిగువన పులిచింతలకు నీటిని విడుదల చేయనున్నారు. ఆగస్టు రెండో తేది వరకు సాగర్ ఎడమ కాలువకు అన్నదాతలకు సాగు నీటి విడుదల చేయనునున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సాగర్ నుండి 4,618 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.