calender_icon.png 23 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివ శివా.. వస్తే ఉగ్గబట్టాల్సిందే

23-07-2025 12:18:23 AM

-చెరువుగట్టు క్షేత్రంపై మరుగుదొడ్లు కరువు

-క్షేత్రంపై సులభ్ కాంప్లెక్స్ దందారూ.10 ఇచ్చి వెళ్లాల్సిందే..

-రద్దీ రోజుల్లో గుట్టపై దారుణ పరిస్థితులు

-ఎక్కడ చూసినా టాయిలెట్ విసర్జన

-పట్టించుకోని అధికార యంత్రాగం

నల్లగొండ, జూలై 22 (విజయక్రాంతి) : అది తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శివక్షేత్రాల్లో ఒకటి. నిత్యం వేలాది మంది భక్తుల రద్దీ. అమావాస్య వచ్చిందంటే చాలు.. అడుగు పెట్టే సందు ఉండదు. ఆ పుణ్యక్షేత్రమే చెర్వుగట్టు. ఇక్కడ కొలువుదీరిన శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే వారి సంఖ్య కోకొల్లలు. కానీ అందుకు తగ్గట్టుగా వసతులు కల్పించడంలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమవుతోంది. ఈ క్షేత్రంపై బొట్టు పెట్టాలన్నా.. రూ.10 ఇయ్యాల్సిందే. బొట్టు పెట్టుకోవడం దగ్గరి నుంచి కొబ్బరికాయ కొట్టడం వరకు భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. చెర్వుగట్టు క్షేత్రంపై ఏండ్ల తరబడిగా ఇదే తంతు కొనసాగుతోంది.

పాలకులు మారారు.. ప్రభుత్వాలు మారాయి.. కానీ చెర్వుగట్టు క్షేత్రంపై భక్తులు పడే ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రధానంగా చెర్వుగట్టు క్షేత్రంపై పారిశుద్ధ్య సమస్య తాండవిస్తోంది. చెర్వుగట్టు క్షేత్రానికి వచ్చే భక్తులు మలమూత్ర విసర్జన కోసం చెట్లు.. పుట్టలు.. బండరాళ్లు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నా.. అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం. చెర్వుగట్టు పైన ఎక్కడా మలమూత్ర విసర్జన కోసం మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

క్షేత్రంపై ప్రైవేటు దందా..

చెర్వుగట్టు క్షేత్రంపై గతంలో మూత్రశాలలను ఏర్పాటు చేశారు. కానీ అది ముణ్ణాళ్ల ముచ్చటగానే మారింది. అభివృద్ధి పనుల మాటున అవి ఎందుకు పనికీ రాకుండా పోయాయి. దీంతో చెర్వుగట్టు క్షేత్రంపైన సులభ్ కాంప్లెక్స్(ప్రైవేటు ప్రాతిపదికన)ను నిర్మించారు. ఈ కాంప్లెక్స్ ఒక్కటే భక్తులకు దిక్కని చెప్పాలి. ఒకటీ వచ్చినా రెండు వచ్చినా.. రూ.10 ఇస్తే గానీ ఇక్కడ పనికాదు. వేల సంఖ్యలో వచ్చే భక్తులకు మొత్తానికి ఈ సులభ్ కాంప్లెక్స్ ఒక్కటే కావడంతో గంటల తరబడి బారులుదీరాల్సి వస్తుంది. ఆపుకోలేకపోయినోళ్లు.. చేతిలో చిల్లర లేనోళ్లు చెట్లు పుట్టులు, రాళ్ల మాటున పని కానిచ్చేస్తున్నారు. దీంతో చెర్వుగట్టు క్షేత్రమంతా మలమూత్ర విసర్జనలతో కంపు కొడుతోంది.

క్షేత్రం పైకి వెళ్లాలంటే.. భక్తి సంగతి పక్కన పెడితే.. ముందు ముక్కు మూసుకుని శివయ్య దగ్గరికి వెళ్లాల్సి వస్తోంది. కొండపైకి వెళ్లే మార్గంలో ఉన్న శివుడి విగ్రహాం దగ్గరి నుంచి మొదలుపెడితే.. దాదాపు కొనేరు వరకు రోడ్డు వెంట మలమూత్ర విసర్జనలే దర్శనమిస్తుంటాయి. నిజానికి ఇక్కడ మరుగుదొడ్లను నిర్మిస్తే.. సమస్య పరిష్కార మవుతుంది. కానీ అలా చేస్తే.. ఇక్కడ ఉన్న ప్రైవేటు కాంప్లెక్స్ గిరాకీ పడిపోతుందనే ఉద్దేశంతోనే నిర్మించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో సైతం సదరు కాంప్లెక్స్లో రోజుకు రూ.10వేలకు పైనే దందా నడుస్తుందని స్థానికులు చెబుతున్నారు.

ఆలయ ఈఓ గారూ.. ఏంటీ నిర్లక్ష్యం..

చెర్వుగట్టు క్షేత్రం సాధారణ రోజుల్లోనూ నిత్యం కిటకిటలాడుతుంది. అమావాస్య రోజైతే అసలు అడుగు తీసి అడుగు వేయాలేని పరిస్థితి. యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు లక్షల్లో తరలి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు. అయితే భక్తులకు ప్రధానగా కావాల్సిన మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఎక్కడా కన్పించడం లేదు. కొండపైకి వచ్చే మార్గమధ్యలో మాత్రం కాటేజీల సమీపంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. కొండపైనా ఎక్కడా తాగేందుకు చుక్క నీరు ఉండదు.

ఒక్కో లీటరు వాటర్ బాటిల్ రూ.30పైనే విక్రయిస్తుంటారు. కొండపైన కొంతమంది రింగ్లా ఏర్పడి ఈ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా చేస్తున్నా.. ఆలయ ఈఓ మాత్రం పట్టించుకోవడం లేదు. దేవుడి మొక్కు చెల్లించుకోవడంలో భాగంగా గుండు గీయించుకోవాలంటే.. టికెట్ ధరతో పాటు అదనంగా ఒక్కో గుండుకు రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే.. మాకు జీతాల్లేవ్.. ఇదే అంతేనంటూ బదులిస్తున్నారు. శివయ్యా క్షేత్రంలో ఇంత జరుగుతున్నా.. ఈఓ మాత్రం నిర్లక్ష్య వైఖరిని వీడడం లేదు.