calender_icon.png 23 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మా.. ఇదేందమ్మా!

23-07-2025 12:00:00 AM

-బెంగళూరు పెంకులతో మోడల్ హౌస్ నిర్మాణం 

-చిన్న వర్షానికే ఉరుస్తున్న వైనం

-ఏడు నెలలు దాటినా పూర్తి కాని ఇల్లు

మహబూబాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): నిలువ నీడలేని నిరుపేదలు ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఇందిరమ్మ ఇల్లు  నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ప్రత్యక్షంగా చూపడానికి ప్రతి మండలంలో ఒక మోడల్ హౌస్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏడాది జనవరిలో మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టారు.

45 రోజుల్లో 5 లక్షల రూపాయల వ్యయంతో మోడల్ హౌస్ నిర్మాణం పూర్తిచేసి లబ్ధిదారులకు ప్రత్యక్షంగా చూపించి, ఆ విధంగా ఇల్లు నిర్మించుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మోడల్ హౌస్ నిర్మాణం చేపట్టిన గృహ నిర్మాణ శాఖ అధికారులు ఏడు నెలలు కావస్తున్న నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నాన్చుతున్నారు. నిర్మాణం ప్రారంభించిన ఆరు మాసాలకు గత నెలలో స్లాబ్ వేశారు. స్లాబు ను పూర్తిగా బెంగళూరు పెంక దిగువ బాగాన పేర్చి వేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే స్లాబు వేసిన తర్వాత మిగిలిన ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ కనెక్షన్, కిటికీలు, డోర్లు ఏర్పాటు చేయకుండా వదిలేశారు.

ప్రారంభానికి ముందే కురుస్తున్న ఇల్లు

ఇదిలా ఉండగా కేసముద్రం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభానికి ముందే వర్షానికి కురుస్తుంది. మొక్కుబడిగా ఇల్లు కట్టి, అత్తరు బుత్తరగా స్లాబ్ వేసి వదిలేశారని, దీనితో వర్షాలకు కులుస్తుందని చెబుతున్నారు. ఫలితంగా అసంపూర్తి గా ఉన్న ఇంటిని చూసి ‘ఇదేం మోడల్ హౌస్’ అంటూ వాపోతున్నారు. ఈ ఇంటిని ఎవరైనా చూస్తే  ఈ తరహాలో ఇల్లు కట్టుకునేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు.