30-12-2025 01:58:14 AM
మండిపడ్డ దుర్గా నగర్ వాసులు.. జలమండలికి హెచ్చరిక
మణికొండ, డిసెంబర్ 29, (విజయక్రాంతి): మణికొండ మున్సిపల్ పరిధిలోని పుప్పాలగుడ పాత గ్రామం దుర్గా నగర్ కాలనీలో గత వారం రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలనీవాసులు సోమవారం జలమండలి అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. చుక్క నీరు రాక నిత్యవసరాలకు కూడా అవస్థలు పడుతున్నామని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని గుట్టమీది నరేందర్, గోరుకంటి విఠల్, బండమీది మల్లేశ్, సంతోష్, రాజ్ కుమార్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కాలనీవాసుల ఆవేదనకు సంఘీభావంగా సీతారాం ధూళిపాళ, మాజీ కౌన్సిలర్ పద్మారావు, ఉపేందర్నాథ్ రెడ్డి, సముద్రాల రమేశ్ అధికారులతో మాట్లాడి నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.మున్సిపల్ పరిధిలో మంచినీటి సరఫరా అస్తవ్యస్తంగా మారుతోందని, వారం రోజులుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని నేతలు విమర్శించారు. దీనిపై స్పందించిన జలమండలి అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న సాంకేతిక సమస్యలను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో కాలనీ వాసులు ప్రస్తుతానికి వెనుదిరిగినప్పటికీ, పనులు వేగవంతం కాకుంటే భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.