14-03-2025 12:00:00 AM
పటాన్ చెరు, మార్చి 13 : పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాలలో భూగర్భ జలాలు దర్జాగా దోపిడి జరవుతున్నాయి. ఇక్కడ వాల్టా చట్టం ఏ మాత్రం పని చేయడం లేదు. ఉచిత కరెంటు వినియోగిస్తూ వ్యవసాయ బోర్ల నుంచి రోజుకు లక్షల లీటర్ల నీటిని తోడేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు తరలించి అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు.
వాల్టా చట్టాన్ని పల్టీ కొట్టిస్తూ యథేచ్చగా జరుగుతున్న నీటి దోపిడిని అడ్డుకొని చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ప్రత్యక్ష సహకారం అందిస్తున్నారు. పటాన్ చెరు పరిధిలోని పాశమైలారం, ఇస్నాపూర్, జిన్నారం మండలంలోని గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామిక వాడలోని పరిశ్రమలకు ప్రతి రోజు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా సంవత్సరాలుగా రాత్రింబవళ్లు జరుగుతూనే ఉంది.
వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి ప్రభుత్వం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంటును వినియోగిస్తున్నారు. గడ్డపోతారం, ఖాజీపల్లి, ఐడీఏబొల్లారం, పాశమైలారం, ఇస్నాపూర్, బొంతపల్లి నీటి రవాణా వ్యాపారంగా మారింది. ఈ ప్రాంతాల సమీపంలోని గ్రామాలలో వ్యవసాయ బోర్లను అద్దెకు తీసుకొని ఈ అక్రమ నీటి దందాను కొనసాగిస్తున్నారు.
బోర్ల వద్ద పెద్ద పెద్ద గుంతలు తవ్వి రాత్రంతా అందులో నీటిని నింపి పగలంతా ట్యాంకర్ల ద్వారా తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇందు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో చోట పదుల సంఖ్యలో బోర్లు ఉంటున్నాయి. పారిశ్రామిక వాడల్లో రోడ్లను ఆక్రమించి ట్యాంకర్లను నిలిపి ఉంచడం, వెనుక ముందు చూసుకోకుండా ట్యాంకర్లను రోడ్లపై నడిపించడం తరుచూ వీటి ద్వారా ప్రమాదాలు జరుగడం పరిపాటిగా మారింది.
పరిశ్రమల ఎదుట ప్రభుత్వ రోడ్లను ఆక్రమించి ట్యాంకర్లను పార్క్ చేయడం జరుగుతున్నది. పటాన్ చెరు పరిధిలోని ముత్తంగి, కర్దనూరు, పాశమైలారం, నందిగామ, రుద్రారం, ఇస్నాపూర్, చిట్కుల్, పోచారం, కిష్టారెడ్డిపేట, గండిగూడెం గ్రామాల నుంచి అక్రమంగా నీటి రవాణా జరుగుతోంది.
అలాగే జిన్నారం మండలంలోని కిష్టయ్యపల్లి, కొర్లకుంట, దాచారం పునరావాస కాలనీ, అల్లీ నగర్, ప్రశాంత్నగర్, నల్తూరు, గడ్డపోతారం, ఖాజీపల్లి గ్రామాల నుంచి, గుమ్మడిదల మండలంలోని బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, కానుకుంట గ్రామాల నుంచి ప్రతి రోజు నీటి రవాణా ట్యాంకర్ల ద్వారా జరుగుతోంది. రెవెన్యూ అధికారులు ట్యాంకర్ల తిరిగే రోడ్డు నుంచే కార్యాలయానికి వచ్చి వెళ్తున్న చర్యలు తీసుకోవడం లేదు.
పైగా వాహనాలన్ని ఫిట్ నెస్ లేనివే ఎక్కువ. ట్యాంకర్ల ద్వారా ప్రమాదాలు జరిగి చనిపోయన వారిలో చిన్న పిల్లలు సైతం ఉన్నారు. రెవెన్యూ అధికారులు సహకారం లేకుండా నీటి రవాణా జరిగే ప్రసక్తే లేదు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ దర్జాగా సహజన వనరులను దోపిడి చేస్తున్న వారిపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు, రైతులు కోరుతున్నారు.