12-12-2025 12:31:48 AM
మెదక్ జిల్లాలో 85.93 శాతం
సంగారెడ్డి, డిసెంబర్ 11 (విజయక్రాంతి):గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగం గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు గురువారం జరుగగా, ఫలితాలు సైతం వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా లోని కంది, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లోని 129 సర్పంచ్, 1,133 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మెల్లిమెల్లిగా ఊపందుకుంది.
చలిని సైతం లెక్కజే యకుండా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని ఈ మండలాల్లో 95,373 మంది పురుష ఓటర్లకు గాను 84,358 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే 99,918 మంది మహిళా ఓటర్లు ఉండగా 87,426 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 32 మంది ఇతరుల ఓట్లు ఉండగా 20 మంది వినియోగించుకున్నారు. మొత్తంగా 1,95,323 మంది ఓటర్లకు గాను 1,71,804 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటల వరకు 23.46 శాతం పోలింగ్ జరుగగా, ఉదయం 11 గంటలకు 57.16 శాతం, మధ్యాహ్నం 1 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 84.83 శాతం నమోదవగా క్యూలైన్లో ఉన్న వారికి అవకాశం ఇవ్వడంతో మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో 87.96 శాతం పోలింగ్ నమోదైంది. కాగా హత్నూర మండలంలో 40,473 మంది ఓటర్లు ఉండగా 36,448 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 90.06 శాతం అత్యధికంగా నమోదైంది.
మెదక్ జిల్లాలో 88.46 శాతం నమోదు...
మెదక్ జిల్లాలోని తొలి విడతలో భాగంగా అల్లాదుర్గం, రేగోడు, టేక్మాల్, హవేళీ ఘణపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట మండలాలకు జరిగిన ఎన్నికల్లో మొత్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 85.93 శాతం నమోదైంది. ఆరు మండలాలకు సంబంధించి 77,978 మంది పురుష ఓటర్లు, 85,168 మహిళా ఓటర్లు ఉండగా ఇతరులు ఇద్దరు ఉన్నారు. మొత్తం 163148 ఓటర్లు ఉండగా 1,44,323 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 9 గంటల వరకు 33,471 ఓట్లు పోలవగా 20.52 శాతం నమోదైంది. ఉదయం 11 గంటల వరకు 92,117 ఓట్లు పోలవగా 56.46 శాతం నమోదైంది. అలాగే పోలింగ్ ముగిసే మధ్యాహ్నం 1 గంటల వరకు 1,40,200 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 85.93 శాతం నమోదైంది.
అయితే క్యూలైన్లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకోగా 88.46 శాతం పోలింగ్ నమో దైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా రేగోడు మండలంలో 18,747 మంది ఓటర్లకు గాను 17,085 మంది ఓటు హక్కు వినియోగించుకోగా అత్యధికంగా 91.13 శాతం నమోదైంది.