29-01-2026 01:02:23 AM
సుహాస్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘హే భగవాన్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బీ నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ‘లిటిల్‌హార్ట్స్’ ఫేమ్ శివానీ నగరం కథానాయిక. కాగా ఈ సినిమాలో నరేశ్ వీకే కీలక పాత్రలో నటిస్తుండగా, యాంకర్ స్రవంతి చొక్కారపు ఓ ముఖ్యపాత్రలో కనిపించనుంది. వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ వంటివారు ఇతర ముఖ్య తారాగణంలో ఉన్నారు.
అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ సినిమా నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్లపై థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ “ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ విత్ కంటెంట్ ఉంటుంది. ఇక నుంచి నా సినిమాలు అందర్ని అలరిస్తాయి.
ఈ సినిమా నా కెరీర్ బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది” అన్నారు. హీరోయిన్ శివానీ నగరం మాట్లాడుతూ.. “ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాలసినంత వినోదం ఉంది. సెట్ అంతా నవ్వుల మయంగానే ఉండేది. రేపు థియేటర్స్ కూడా నవ్వుల మయం కాబోతున్నాయి” అని చెప్పారు. ‘ఫిబ్రవరి 20న మా నిర్మాతకు ఈ సినిమా రూపంలో బ్లాక్‌బస్టర్ ఇస్తున్నాన’ని చిత్ర దర్శకుడు గోపీ అచ్చర తెలిపారు. నిర్మాత నరేంద్రరెడ్డి మాట్లాడుతూ.. “మా మొదటి ప్రయత్నం. నా కెరీర్‌లో ఇది ఇంపార్టెంట్ సినిమా. ప్రేక్షకులు సక్సెస్ ఇస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ.. “టీజర్ ఉన్నట్లు ఆడియన్స్ ఎవరైనా బిజినెస్ ఏదో గెస్ చేసి బహుమతి అందుకోవచ్చు. ఈ సినిమాతో నిర్మాత నరేంద్రరెడ్డి పేరు గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త సుహాస్‌ను చూడబోతున్నారు. శివానీకి ఈ సినిమా మూడో బ్లాక్‌బస్టర్” అన్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రామ్‌కుమార్, ఎడిటర్ విప్లవ్, డీవోపీ మహిరెడ్డి, వంశీ నందిపాటి, హీరో అఖిల్‌రాజ్, హీరోయిన్ తేజస్వీరావు, దర్శకుడు సాయి మార్తాండ్, నిర్మాత రమణారెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.