06-08-2025 12:12:38 AM
జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
గద్వాల, ఆగస్టు 05 : బాలల సంక్షేమం కోసం యూనిసెఫ్ బృందం చేసిన సూచనలను పాటిస్తూ వాటిని మెరుగుపరచేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ తెలిపారు. మంగళవారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సూపర్వైజ్డి సప్లిమెంటరీ ఫీడింగ్ ప్రోగ్రాం అమలుపై యూనిసెఫ్ బృందం, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనిసెఫ్ బృందం గద్వాల్ మెడికల్ కాలేజ్ సమీపంలోని మెడిసిన్ స్టోర్ను, గట్టు మండలంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ సబ్ సెంటర్ను సందర్శించి, ఔషధల సరఫరా, పోషకాహార పంపిణీ, వైద్య సేవల అమలును పరిశీలించారు. బృందం తమ పరిశీలనలో భాగంగా కొన్ని అంశాలను కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ బృందం గద్వాల్ జిల్లా ప్రగతిశీలంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రశంసించింది.
ముఖ్యంగా చిన్నారులలో పోషణ లోపాలను గుర్తించే విధానం మెరుగ్గా ఉందని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, యూనిసెఫ్ బృందం చేసిన సూచనలను పాటించి,వాటి ఆధారంగా జిల్లా స్థాయిలో అందించే సేవల నాణ్యతను మెరుగుపరిచే దిశగా సమగ్ర చర్యలు చేపడతామని తెలిపారు.
జిల్లాలో పోషక ఆహార సేవలు పొందడంలో విఫలమైన లేదా స్పందించని చిన్నారులు, ఎదుగుదల లోపాలను గుర్తించితగిన చర్యలు తీసుకుని, వారిని ఆరోగ్యంగా తయారుచేసే దిశగా పూర్తి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు, జిల్లా సంక్షేమ అధికారి సునంద, డిపిఓ నాగేంద్రం, జిలా వైద్య అధికారి సిద్ధప్ప,యూనిసెఫ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.