24-09-2025 12:11:05 AM
ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : నిజామాబాద్ నగర నియోజకవర్గ అభివృద్ధికి శాయాశక్తులా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలో నీ శ్రీనగర్ కాలనీలోని 45 డివిజన్‌లో మున్సిపల్ కమిషనర్ దిలీప్‌కుమార్‌తో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని డివిజన్‌లోని బాల హనుమాన్ మందిరం పక్కన ఉన్న అండర్ బ్రిడ్జి పాడైపోయినందున కొత్త వంతెన కోసం డీపీఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే కొత్త వంతెన నిర్మిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
డ్రెయినేజీ సమస్యలు తలెత్తకుండా మున్సిపల్ సిబ్బంది నిత్యం శుభ్రం చేయాలని ఆదేశించారు. అవసరమున్న చోట డ్రెయినేజీల పునర్నిర్మాణం చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిజామాబాద్ కార్పొరేషన్‌ను పారిశుధ్యంలో మొదటిస్థానంలో నిలబెట్టే దిశగా ప్రతి అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని ఆయన సూచించారు. నగరంలోని వీధిదీపాల కొరత తీవ్రంగా ఉందని.. వీలైనంత త్వరగా స్ట్రీట్‌లైట్ల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలైన బీటీ, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఓపెన్ జీమ్ పార్కుల అభివృద్ధి, కల్వర్టుల నిర్మాణానికి స్పెషల్ ఫండ్ కింద రూ. 100 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ధన్‌పాల్ తెలిపారు. అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ..
రాత్రి సమయంలో ఆకతాయిలు 45వ డివిజన్‌లో మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్నారని వివరించగా.. కట్టికి చర్యలు తీసుకునేలా ఏసీపీతో మాట్లాడతానని చెప్పారు. కార్యక్రంలో మున్సిపల్ ఏఈ పావని, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు ఆకుల శ్రీనివాస్, నరేశ్, బొబ్బిలి వేణు, ఎర్రన్న, బీజేపీ నాయకులు పవన్, ఆనంద్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.