08-10-2025 12:00:00 AM
గోండ్ వీరుడి పోరాటాన్ని స్మరించుకున్న నేతలు
ఆదిలాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): గోండు వీరుడు... ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన యోధుడు కొమురం భీం వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆయా సంఘాల నాయకులు ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించి, ఆయన చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీం చేసిన పోరాటాన్ని గుర్తించింది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే నని ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
అందుచేతనే ఆ మహానీయుడు ప్రాణాలర్పించిన జోడేఘాట్‌లోనే కోట్ల రూపాయలను వెచ్చించి ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని గుర్తు చేశారు. కొమురం భీం వర్ధంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, ఆదివాసీలతో కలిసి పార్టీ జిల్లా కార్యాలయం నుండి ఆదివాసి సాంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు తమ సాంప్రదాయ నృత్యాలు చేయ గా, జోగు ప్రేమేందర్ వారితో కలిసి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.
అదేవిధంగా జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవి బిడ్డల హక్కుల కోసం పోరాడిన కొమురం భీం పోరాట పటిమ ఎన్నటికీ మరువలేనిదని, వారి ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. భీం వర్ధంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ లోని భీం విగ్రహానికి కాంగ్రెస్ నేతలతో కలిసి భీం విగ్రహానికి పూలమామాలు వేసి నివాళులు అర్పించి, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అటు బీజేపీ నాయకులు సైతం కొమురం భీం వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టారు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
జల్.. జంగల్.. జమీన్... నినాదంతో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసుకున్నారు. అదేవిధం గా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి కలిసి కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొమురం భీం ఆశయ సాధన దిశగా పాలన సాగిస్తోందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆధ్వర్యంలో నాయకులు భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి ఆధ్వర్యంలో సభ్యులు కొమురం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.