01-07-2025 12:00:00 AM
పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు కాగా, ఏ దయాకర్‌రావు నిర్మాత. ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది. వాస్తవానికి బాబీ డియోల్ పోషిస్తున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలను ప్రారంభంలోనే చిత్రీకరించారట. కానీ ‘యానిమల్’ చూసిన తర్వాత ఆయన పాత్రను పునఃరచించాలని నిర్ణయించుకున్నారట.
ఇదే విషయాన్ని డైరెక్టర్ జ్యోతికృష్ణ చెప్తూ.. “యానిమల్’లో బాబీ డియోల్ నటన అద్భు తం. పాత్రకు సంభాషణలు లేకపోయినా, హావభావాల ద్వారానే భావోద్వేగాలను వ్యక్తపరిచిన ఆయన అసమాన ప్రతిభ ఆశ్చర్యపరిచింది. అందుకే మా సినిమాలో కూడా ఆయన పాత్ర కోణాన్ని మార్చి, పూర్తిగా సరికొత్త రూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నా.
నేను సవరించిన స్క్రిప్ట్‌ను చెప్పినప్పుడు బాబీ చాలా ఉత్సాహపడ్డారు. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇష్టపడే నటుడాయన. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం” అని జ్యోతికృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి; కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: తోట తరణి.