11-10-2025 12:00:00 AM
ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎం హీరోహీరోయిన్లుగా దర్శకుడు విజయేందర్ రూపొందిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. కళ్యాణ్ మంథిన, భానుప్రతాప, డాక్టర్ విజేందర్‌రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్, భాను ప్రతాప మీడియాతో ముచ్చటించారు. “బన్నీ వాస్ మాకు మంచి స్నేహితుడు. గీతాఆర్ట్స్‌లో చాలా కాలం ఆయనతో పనిచేశాం.
వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. నిర్మాతలుగా ఇది మాకు తొలి ప్రాజెక్ట్. చిత్ర కథ, కథనాల గురించి మేం అంతా కలిసి మాట్లాడుకునే వాళ్లం. చర్చించుకునేవాళ్లం. సలహాలు, సూచనల్ని అందరం పంచుకునేవాళ్లం. చర్చల్లో అభిప్రాయ భేదాలు సహజం. కానీ వాటికన్నా సినిమా గొప్పది. మేం రైటర్స్‌తో కలిసి రైటింగ్ రూమ్‌ను ముందుగా ప్రారంభించాం. స్క్రిప్ట్ ఓ లెవెల్ వచ్చేవరకు మేం అందులో ఇన్వాల్వ్ అవుతాం.
ఈ స్టోరీ ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్‌గా ఉంటుంది. విజయేందర్ ఈ కథ అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు. కథ రాసుకున్నప్పుడే ఏ పాత్రకు ఎవరు కావాలని ముందు నుంచే ఫిక్స్ అయి ఉన్నాడు. బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. సినిమా పూర్తయిన తర్వాత ఏదో అసంతృప్తిగా అనిపించింది.
దీంతో బ్రహ్మానందంతో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్‌ను ఎంజాయ్ చేశారు. ‘మిత్ర మండలి’ బడ్డీస్ కామెడీ. అందుకే అందరూ ‘జాతి రత్నాలు’తో పోల్చుతున్నారు. ఆ కథకు, ఈ కథకూ ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్నీ అంతే ఎంజాయ్ చేస్తారు. ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్‌ను డైరెక్టర్ క్రియేట్ చేశాడు.
ఆ ఫిక్షనల్ టౌన్‌లో జరిగే కథ, అందులోని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. నిహారిక మాట్లాడితే ఓ సెటైర్ కనిపిస్తుంది. ఇందులో అలాంటి పాత్రే ఉంటుంది. అందుకే ఆమెను తీసుకున్నాం. అల్లు అరవింద్ నిహారికను చూసిన వెంటనే ఓకే చేశారు. ఈ సినిమాలో భారీ తారాగణం ఉంది. వారి డేట్లు సర్దుబాటు చేసుకుని షూటింగ్ చేసుకోవడం సవాల్ అనిపించింది. ఈ సినిమా కోసం లేని ఓ కులం పేరును తీసుకువచ్చాం.
అలా చేసిన ఫిక్షనల్ క్యాస్ట్‌తో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ మీద సెటైరికల్‌గా సీన్లను చిత్రీకరించాం. దీపావళి పండుగ వాతావరణంలో ఎన్ని మంచి చిత్రాలు వచ్చినా జనం చూస్తారు. మంచి సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకంతోనే మా చిత్రాన్ని దీపావళి సీజన్‌లోకి తీసుకువస్తున్నాం. మేం చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అన్ని జానర్లలో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాం. త్వరలోనే హారర్ మూవీని ప్రారంభించనున్నాం.