11-10-2025 07:47:22 PM
మేడారం పనులను సొంత కంపెనీకి ఇప్పించుకుంటున్నారని విమర్శ..!
సోనియా, రాహుల్ గాంధీలతో పాటు మీనాక్షి నటరాజన్‌లకు ఫిర్యాదు..
అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన వచ్చిందన్న కొండా మురళీ..
హన్మకొండ (విజయక్రాంతి): వరంగల్ రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జోక్యం చేసుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి తన సొంత కంపెనీకి మేడారం పనులను ఇప్పించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా కొండా మురళి ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో అధిష్ఠానం నుంచి తమకు సానుకూల స్పందన వచ్చిందని కొండా మురళి తెలిపారు. దేవాదాయ శాఖలో పొంగులేటి జోక్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న మేడారం జాతరను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అయితే మేడారం జాతర పనుల కోసం నిర్వహించే టెండర్ల వ్యవహారంలో పొంగులేటి తన సొంత కంపెనీకి పనులు ఇప్పించుకుంటున్నారని కొండా మురళి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.