11-10-2025 07:49:01 PM
కాటారం,(విజయక్రాంతి): ఈ నెలాఖరులో పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య తెలిపారు. పత్తి రైతులు పత్తిని అమ్ముకొనుటకు సూచనలు తెలియజేస్తున్న పోస్టర్లను వ్యవసాయ మార్కెట్ కమిటీ కాటారం చైర్ పర్సన్ పంతకాని తిరుమల- సమ్మయ్య ఆవిష్కరించారు. చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య మాట్లాడుతూ రాష్ట్రమంతా ఈ నెల చివరి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతున్న దృష్ట్యా పత్తి రైతులు పత్తిని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. సెంటర్లకు వెళ్లే ముందుగానే కపాస్ కిసాన్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి స్లాట్ బుక్ చేసుకొని, పత్తిని ఇష్టమైన మిల్లుకు విక్రయించడానికి సౌలభ్యంగా ఉంటుందని అన్నారు. ఆధార్ లింక్ తోనే డబ్బులు రైతు ఖాతాలో జమవుతాయని తెలిపారు.రైతులందరూ ముందుగానే ఆధార్ కార్డును కావలసిన బ్యాంకుకు లింకు చేసుకోవాలన్నారు.
పత్తికి మద్దతు ధర 2025-26 సంవత్సరంలో క్వింటాల్ కు 8110 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. తేమ 8 నుంచి 12 మధ్యలో ఉండాలని తెలిపారు. ఈ సంవత్సరం సక్రమంగా పత్తి కొనుగోలు జరిగే లాగా ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పిల్లమారి రమేష్ , ఆత్మకూరు కుమార్ యాదవ్, ఏఎంసీ కార్యదర్శి, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.