calender_icon.png 18 August, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోస్టులు మా ఇష్టం!

11-12-2024 01:08:12 AM

  1. ఉన్నత విద్యామండలిలో చోద్యం 
  2. ప్రభుత్వ అనుమతి లేకుండా పోస్టులు 
  3. కీలక పదవులు సృష్టించి మరీ నియామకం
  4. నేడో రేపో మరో ఇద్దరికి పోస్టింగ్?

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అంతా మా ఇష్టం అన్నట్టుగా తెలంగాణ ఉన్నత విద్యామండలి వ్యవహరిస్తోంది. ఓవైపు తమ అనుమతి లేకుండా ఎటువంటి నియామకాలు చేపట్టొద్దని ప్రభుత్వం చెప్తుంటే.. ఉన్నత విద్యామండలి మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పోస్టింగ్‌లు ఇస్తున్నది.

కీలక పదవులను సృష్టించి మరీ తమకు అనుకూలమైన వారిని నియమిస్తుంది. ఇప్పటికే ముగ్గురిని నియమించినట్టు తెలంగాణ విద్యామండలి అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం నియమించిన ముగ్గురిలో ఒకరు ఓఎస్డీ, రెండు కన్సల్టెంట్ పోస్టులున్నాయి. నేడో రేపో మరో ఇద్దరిని సైతం నియమించనున్నట్టు సమాచారం.

లేని ఓఎస్డీ పోస్టును సృష్టించినట్టు ఆరోపణలున్నాయి. ఈ పోస్టులో ఓ ప్రైవేట్ యూనివర్సిటిలో పనిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు దాదాపు రూ.లక్ష వరకు వేతనమిచ్చి నియమించారు. మిగతా ఇద్దరు కన్సల్టెంట్ పోస్టుల్లో ఒకరు రీసెర్చ్ కోసం, మరోక కన్సల్టెంట్ ఇండస్ట్రీ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నట్టు ఉన్నత విద్యామండలిలోని ఓ అధికారి తెలిపారు.

మరో ఇద్దర్ని కూడా ఒకట్రెండు రోజుల్లో నియమించనున్నట్టు పేర్కొన్నారు. వీరికి నెలకు దాదాపు రూ.50 వేల నుంచి రూ.55 వేలు వేతనంగా నిర్ణయించినట్టు తెలిసింది. 

డిప్యూటేషన్ అవకాశమున్నా.. 

ప్రభుత్వ సంస్థల్లో ఒక నిర్ణీత గడువు వరకు ఏడాది.. రెండేళ్లు, మూడేళ్లు పనిచేసేందుకు ప్రభుత్వ ఉద్యోగులనే డిప్యూటేషన్ కింద నియమించుకునే అవకాశం ఉంది. ఈ విధానం విద్యాశాఖలో కొనసాగుతోంది. కానీ, తెలంగాణ ఉన్నత విద్యామండలి నియమించిన ఈ పోస్టుల్లో డిప్యూటేషన్ కింద ప్రభుత్వ ఉద్యోగులను నియమించకుండా వీళ్లే జీతాలిచ్చేలా.. ఇతరులను నియమించుకుందనే ఆరోపణలున్నాయి.

తెలంగాణ ఉన్నత విద్యామండలికి ఉన్న కొన్ని అధికారాల మేరకు తమ ఇష్టానుసారంగా నియామకాలు చేపడ్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు విద్యా, ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలు, ఇతర రంగాలతో అనుసంధానంగా వీరు పనిచేయనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం ఉన్నప్పుడు ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్‌గా ఓ మహిళా ఉద్యోగిని నియమించినట్టు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. ఈమెను నియమించి కూడా నాలుగైదు నెలలు కావొస్తోంది. ఈ పోస్టు అసలు అవసరమే లేదనే ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆయా యూనివర్సిటీల్లో కో ఉన్నారు.

కానీ, ఈమెను కన్సల్టెంట్ పోస్టులో నియమించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యను అందించే కళాశాలల్లో విద్యార్థులకు యాంటి డ్రగ్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, సేఫ్టీ అంశాలపై అవగాహనను కల్పించేందుకు వీలుగా నియమించారు. అయితే ఈమెను కావాలనే నియమించారనే తీవ్ర ఆరోపణలు విద్యావర్గాల నుంచే వినిపించడం గమనార్హం.