31-12-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, డిసెంబర్ 30(విజయక్రాంతి):తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 21 మండలాలలో మండల స్థాయిలో తెలుగు , ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలలో మొద టి మూడు స్థానాలలో నిలిచిన పదవ తరగతి విద్యార్థులకు జిల్లా స్థాయిలో గణిత టాలెంట్ టెస్ట్ స్థానిక సాయి బాలాజీ గార్డెన్స్ లో మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరై మాట్లాడుతూ తన చిన్నప్పుడు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ చేతుల మీదుగా గణిత టాలెంట్ టెస్ట్ నందు బహుమతి అందుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు కూడా గణితంతో పాటు అన్ని విషయాల్లో ప్రావీణ్యం సంపాదించాలని, ప్రతిభా వంతులైన విద్యార్థులు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు కాన్సెప్ట్ నేర్చుకోవటంలో సహకరించాలని, విద్యార్థులు అందరూ 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఏసీజీఈ కరుణాకర్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలీ ఘనపూర్ మండల విద్యాధికారి మధుమోహన్, టీఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు కొండల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్, కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు బాలరాజు, నరసింహ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు.