19-07-2025 01:07:15 AM
మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు
హన్మకొండ,జూలై 18:- (విజయక్రాంతి): బీసీలు నాది పెద్ద కులం నీది చిన్న కులం అని కులాల వారీగా విడిపోకుండా ఒక తాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు,ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వన్నాల శ్రీరాములు అన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి,ప్రముఖ న్యాయవాది పృథ్వీరాజ్ సింగ్ సంయుక్తంగా రచించిన ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్ష సదస్సును ఈ నెల 20న హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్ లో ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ సౌజన్యంతో జన అధికార సమితి ఏర్పాటు చేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు,ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్టు బోర్డు చైర్మన్ వన్నాల శ్రీరాములు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్,ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబారి సమ్మారావు,వ్యాక్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వన్నాల వెంకట రమణ,జన అధికార సమితి రాజకీయ విశ్లేషకులు తిరునగరి శేషు,బీసీ ఇంటిలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ లు శుక్రవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వన్నాల శ్రీరాములు మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుండి ఓబీసీలకు రిజర్వేషన్ల ప్రక్రియలో జరుగుతున్న అన్యాయాలను,హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాల పనితీరును ఎండగడుతూ సర్వీస్లో ఉన్న ఐఎఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రచించిన ఓబీసీల పోరుబాట పుస్తకంలోని అంశాలను ప్రతి బీసీ వంటపట్టించుకోవాలని సూచించారు. వెనుకబడిన తరగతులకు చెందిన జాతులు కులాలుగా విడిపోవడం మూలంగా అగ్ర కులాలు రాజ్యాధికారం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కులాలను ప్రక్కన పెట్టి బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. ఎవరిపై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని,కేవలం మన ఓట్లు మనం వేసుకుని సత్తా చాటాలని వన్నాల పిలుపు నిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల వివక్ష చూపుతున్నారని,తద్వారా 60 శాతం ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరని అన్యాయం చేస్తున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు ఆరోపించారు.