07-07-2025 12:00:00 AM
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కొట్టి బీఆర్‌ఎస్ పార్టీని రాష్ర్టంలో లేకుండా బొంద పెడుతామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్‌పై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లుగా వంద సీట్లలో విజయం సాధిస్తామన్నారు.
ఇప్పటి నుంచి తమ నినాదం ‘వంద కొడదాం.. బీఆర్‌ఎస్‌ను బొంద పెడదాం’ అని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించినప్పటికీ బీఆర్‌ఎస్ నేతల్లో ఇంకా అహంకారం, బలుపు ఏమాత్రం తగ్గలేదని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే కేసీఆర్ రావడం లేదని.. ఎన్నికల్లో ప్రజలు ఛీకొడితే ఫామ్ హౌజ్, గెస్ట్‌హౌజ్‌కు పరిమితమైన మీకు.. సీఎం రేవంత్‌రెడ్డితో పోటీ ఏంటని ఎద్దేవా చేశారు.
ఓ వైపు అభివృద్ధి పనులు చేపడుతూనే.. మరోవైపు సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరు చూసి బీఆర్‌ఎస్ నేతలు కడుపు మండి అర్థంలేని ఛాలెంజ్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో దోచుకున్న, దాచుకున్న డబ్బుతో పింక్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారని కేటీఆర్ తస్మాత్ జాగ్రత్త అంటూ మండిపడ్డారు. మీ పద్ధతి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని జనం రాళ్లతో కొట్టుడు ఖాయమని హెచ్చరించారు.