17-05-2025 11:42:22 PM
తెలంగాణ సినిమా వేదిక(టీసీవీ) హెచ్చరిక
ముషీరాబాద్ (విజయక్రాంతి): గద్దర్ ఫిలిమ్ అవార్డును తెలంగాణ సినిమాలకు ఇవ్వకపోతే అడ్డుకుంటామని తెలంగాణ సినిమా వేదిక(టీసీవీ)రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. శనివారం చిక్కడపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీసీవీ రాష్ట్ర నేతలు తుమ్మల ప్రపుల్ రాంరెడ్డి, టీసీవీ రాష్ట్ర గౌరవ సలహాదారు, లారా రాష్ట్ర కన్వీనర్, మోహన్ బైరాగి, కో-కన్వీనర్లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్న మన సినిమా రంగంపై ఆంధ్ర సినిమా పెద్దల ఆధిపత్యం కొనసాగుతుందని అన్నారు.
పేరుకే తెలంగాణ ఫిలిం చాంబర్ గా ఉండి ఫిలిం అవార్డులు ఆంధ్ర ఫిలిం ఛాంబర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు థియేటర్లు మాఫియా నడుస్తుందన్నారు. తెలంగాణ సినిమా రంగం ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యల్ని పరిష్కరించాలన్నారు. గద్దర్ ఫిలిం అవార్డు తెలంగాణ సినిమాలకు ఇవ్వకపోతే గద్దర్ ఫిలిం అవార్డు కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిసివి నాయకులు రవి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.