26-06-2025 01:12:10 AM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే కుటీర పరిశ్రమలను రాష్ర్ట ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ట్యాంక్‌బండ్‌పై బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకానికి సంబంధించిన స్టాల్స్‌ను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మీడియాతో మాట్లాడారు.
చేతి వృత్తుల ఉత్పత్తులను ప్రోత్సహించి ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని, హైదరాబాద్ నగరానికి చెందిన వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కుటీర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తుల ప్రదర్శన జరుగుతుందని వెల్లడించారు. ఈ ఎగ్జిబిషన్ ను రాష్ర్ట ప్రజలు ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. బెస్త కులస్థులు ఏర్పాటుచేసిన చేపల వంటకాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలతో కలిసి డిప్యూటీ సీఎం రుచి చూశారు.