calender_icon.png 19 July, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

19-07-2025 12:16:50 AM

  1. మున్సిపల్‌లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలి 
  2. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి 

తుర్కయంజాల్, జులై 18: తుర్కయంజాల్ మున్సిపాలిటీలో పాలకవర్గం పదవీకాలం పూర్తయి ఆరునెలలు పూర్తయ్యాయి. అర్థ సంవత్సరకాలంగా అధికారుల పాలనే నడుస్తోంది. మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 100రోజుల ప్రణాళికలో భాగంగా రోజుకో కార్యక్రమం చే పడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్ర తినిధుల సహకారంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, పురపాలిక పరిధిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నానంటున్న మున్సిపల్ కమీషనర్ అమరేందర్ రెడ్డితో విజయక్రాంతి ఫేస్ టు ఫేస్: 

విజయక్రాంతి: నమస్తే కమిషనర్ సర్... పాలకవర్గం లేదు కదా... అభివృద్ధి పనుల విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు? 

కమీషనర్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. మున్సిపల్ నిధులతో పాటు హెచ్‌ఎండీఏ నిధులతో అన్ని వార్డుల్లో పనులు కొనసాగిస్తున్నాం.

విజయక్రాంతి : 100రోజుల ప్రక్రియ ఎలా జరుగుతోంది?

కమీషనర్: పురపాలికను క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. రోజుకో కార్యక్రమం తీసుకొని ప్రజలతో మమేకమవుతున్నాం. 

విజయక్రాంతి: ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఏ విధంగా సాగుతోంది?

కమీషనర్: ఎల్‌ఆర్‌ఎస్ను ప్రతిష్టాత్మంగా తీసుకున్నాం. దీనికోసం మున్సిపాలిటీలో నలుగురు సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాం. ఇప్పటివరకు సుమారు 8వేల ఫైల్స్ పూర్తిచేశాం. మరో 5వేల వరకు పెండింగ్లో ఉన్నాయి. అవికూడా పూర్తిచేసేలా చర్యలు చేపట్టాం.

విజయక్రాంతి: టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరు ఎలా ఉంది? అక్రమ నిర్మాణాల విషయంలో మీ వైఖరి ఏంటి?

కమీషనర్: మున్సిపాలిటీలో టీపీవో రెండురోజులే ఉంటున్నారు. మరో రెండురోజులు ఇక్కడే ఉండేలా ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడారు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అక్రమ నిర్మాణాల విషయంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. అక్రమాలకు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. ఈ విభాగంలో ఎవరైనా తప్పుచేసినట్లు నా దృష్టికి వస్తే వెంటనే రిమూవల్ ఆర్డర్స్ ఇచ్చేస్తా.

విజయక్రాంతి : ఇంటి అసెస్ మెంట్ల విషయంలో ప్రజల ఇబ్బంది మీ దృష్టికి వచ్చిందా? 

కమీషనర్: ఇంటి నెంబర్ల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటున్నాం. గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూస్తున్నాం. ఈ ప్రక్రియలో కొంత జాప్యం ఉన్నది నిజమే. త్వరలోనే పరిష్కరిస్తాం.