26-01-2026 12:00:00 AM
కాంగ్రెస్ నాయకులు
కోదాడ, జనవరి 25: ప్రజాస్వామ్యం ముసుగులో నీచ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే మల్లయ్యనుద్ధేశించి కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. ఆదివారం కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో పీసీసీ డెలిగేట్ సీహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మల్లయ్య హద్దుదాటి ప్రవర్తిస్తున్నారన్నారు.
ప్రమాదవశాత్తు యువకుడు మరణించిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే పద్మావతి కుటుంబ సభ్యులను పరమార్శించి, బాధిత కుటుంబం కోరిన డిమాండ్లు నెరవేర్చే పనిలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బాధిత కుటుంబానికి అండగా ఉన్నారన్నారు.
కేవలం రాజకీయంగా తన ఉనికి కాపాడుకోడానికి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి దంపతులపై మల్లయ్య బురదజల్లే కార్యక్రమం చేపట్టారన్నారు. మల్లయ్య హయాంలో జరిగిన సీఎం ఆర్ ఎఫ్ కుంభకోణం కారణంగానే యువకుడు మరణిస్తే, దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులపై వేయడం మల్లయ్య కుటిలబుద్దికి నిదర్శనం అన్నారు. విధుల్లో ఉన్న అధికారిని కులం పేరుతో దూషించేలా మల్లయ్య వ్యాఖ్యానించడం తగదన్నారు. షాడో ఎమ్మెల్యే అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మల్లయ్య చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదం అన్నారు.
మల్లయ్య హయాంలో ఎవరు షాడో ఎమ్మెల్యేగా ఉండి, అధికారుల బదిలీలకు కారణమయ్యారో నియోజకవర్గంలో అందరికి తెలుసు అన్నారు. మల్లయ్య హయాంలో మట్టి దందా, ఇసుక దందా గురించి చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారని అన్నారు. మల్లయ్య వెంటనే మంత్రి ఉత్తమ్ దంపతులకు, అధికారులకు క్షమాపణ చెప్పాలని డిమండ్ చేశారు. గ్రంథాలయ చైర్మన్ వంగవేటి రామారావు, పార సీతయ్య, ఎర్నేని బాబు, చింతలపాటి శ్రీనివాస్, అల్తాఫ్ హుస్సేన్, బషీర్, ఈదుల కృష్ణయ్య, పిల్లుట్ల శ్రీను పాల్గొన్నారు.