calender_icon.png 26 October, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం

25-10-2025 12:00:00 AM

  1. చిన్నారుల హాజరు 90 శాతమే లక్ష్యం 
  2. డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎటువంటి లోపాలను ప్రభుత్వం సహించదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో శుక్రవారం సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మా ట్లాడుతూ పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలామృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాలవారీగా సమీక్ష నిర్వహించిన ఆమె, కొన్ని జిల్లాల్లో సరఫరా 50 శాతానికి కూడా చేరకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జరిగినట్లుగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చిన్నారులు, గర్భిణులు, బాలింత లకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలలో ఇప్పటి వరకు గర్భిణుల హాజరు 80 శాతం, బాలింతల హాజరు 85 శాతం ఉండటం పట్ల మం త్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల హాజ రు ప్రస్తుతం 68 శాతం ఉండగా, దాన్ని 90 శాతానికి పెంచే లక్ష్యాన్ని నిర్దేశించారు.

జిల్లా అధికారులు ప్రతి నెలా పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు. బాల్యవివాహాలు లేని రాష్ర్టంగా తెలంగాణ నిలవాలని పిలుపునిచ్చిన సీతక్క, ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో కార్యదర్శి అనితా రామచం ద్రన్, డైరెక్టర్ శృతి ఓజా పాల్గొన్నారు.