04-09-2025 12:00:00 AM
మేడ్చల్ కలెక్టర్ మనుచౌదరి
కీసర, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని మేడ్చల్ మల్కాజి గిరి కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం కీసర మండలంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదిలోని విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విజ్ఞప్తికి కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలలోని పాత భవనంలో వర్షపు నీరు రావడం, గోడలు తడిగా ఉండటాన్ని కలెక్టర్ పరిశీలించారు. అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపల్‌కు సూచించారు. కిచెన్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని ప్రిన్సిపల్ నరసింహులు తెలుపగా, గ్రిల్స్, డోర్స్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన రైఫిల్ షూటింగ్ రూమ్, కిచెన్ స్టోర్, ఇతర గదులను పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో అడిగి తెలుసుకున్నారు. వండి సిద్ధంగా ఉన్న భోజనాన్ని రుచి చూశారు. కార్యక్రమంలో డీఈవో విజయ కుమారి, కీసర ఎమ్మార్వో అశోక్, ప్రిన్సిపల్ నరసింహులు పాల్గొన్నారు.