calender_icon.png 10 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం

09-01-2026 12:01:41 AM

తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి

కామారెడ్డి, జనవరి 8 (విజయక్రాంతి): గిరిజనులకు పోడు భూములపై న్యాయం చేస్తామని తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి అన్నారు. గిరిజన పోడు భూముల సమస్యలపై గిరిజన రైతులతో సమావేశమై, వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. గురువారం మారుతి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోడు భూ ముల వాటి సమస్యల పై ఉమ్మడి జిల్లా గిరిజన రైతులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  చైర్మెన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల హక్కులకు సంబంధించిన చట్టాన్ని 2005లో పార్లమెంట్లో ప్రవేశపెట్టగా, 2008లో అమలులోకి వచ్చిందన్నారు. దరఖాస్తులు చేసిన పలువురు రైతులకు ఇప్పటివరకు పాస్బుక్కులు రాకపోవడం, కొందరికి మొత్తం విస్తీర్ణానికి కాకుండా తక్కువ ఎకరాలు నమోదు కావడం, హక్కు పత్రాలు ఉన్నప్పటికీ సాగు చేయనివ్వకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు తెలిపారు. 

ఆర్ ఓ ఎఫ్ ఆర్ కింద ఉన్న పట్టాలు భూభారతి పోర్టల్లో కనిపిస్తే చాలా సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. ఈ అంశాలను ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని, ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఏవైనా సమస్యలు ఉన్న రైతులు గ్రామసభల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, కొత్త దరఖాస్తులు సమర్పించే అవకాశం నిరంతర ప్రక్రియగా ఉంటుందని తెలిపారు.  అడవులను రక్షిస్తూ, సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా అందరిదని అన్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను కమిషన్ చైర్మన్కు విన్నవించారు. కొందరికి ఇప్పటివరకు పట్టాలు రాకపోవడం, సాగు చేయనివ్వకపోవడం, పాస్బుక్లో ఎకరాల తేడాలు ఉండటం, బంజారా భవనాల నిర్మాణానికి అనుమతులు, ఆగిపోయిన పాస్బుక్కుల మంజూరు, బోర్లు వేసేందుకు అనుమతులు, బ్యాంకు రుణాలు ఇప్పించాలని చైర్మెన్ దృష్టికి తీసుకెళ్లారు.

కమిషన్ సభ్యులు, అడ్వకేట్ సునీల్ పోడు భూముల హక్కుల చట్టాలపై సవివిరంగా వివరించారు.  సభ్యులు రాములు నాయక్, గంగాధర్, జిల్లా అదనపు కలెక్టర్  విక్టర్, బాన్స్ వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ నరసింహారెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ రావు, తహశీల్దార్ రేణుక చౌహాన్, రెవెన్యూ, అటవీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.