13-01-2026 01:18:10 AM
ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): హెల్మెట్ ప్రాధాన్యతన తెలియజేసి ప్రతి ఒక్క రూ హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం అన్ని పోలీస్ స్టేషన్ల వారీగా బైక్ ర్యాలీలను నిర్వహించి, రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ పై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సం దర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నుండి జిల్లా ఎస్పీ సారథ్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ స్వయంగా బైక్ నడుపుతూ ర్యాలీ లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సిబ్బంది ప్రతి ఒక్కరూ హెల్మెట్ ను ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. అనుకోని సందర్భంలో ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాపాయం లేకుండా హెల్మెట్ కాపాడుతుందని తెలిపారు.
ప్రమాదంలో కుటుంబ పెద్దకు ఆపద ఏర్పడినప్పుడు, కుటుంబ భవిష్యత్తు అయోమయంలో పడుతుందని తెలిపారు. పోలీసులు హెల్మెట్ ధరిం చాలని ప్రోత్సహించేది ప్రజల రక్షణ భద్రత లో భాగంగానే అని తెలిపారు. ఈ సంవత్సరం రోడ్ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా పోలీసు వ్యవస్థ నూతన ప్రణాళికను అవలంబిస్తూ ప్రమాదాల నివారణకై కృషి చేస్తుందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడపాలని సూచించారు. రాష్ట్ర డిజిపి ద్వారా ‘అరైవ్ అలైవ్‘ అనే పేరుతో రోడ్డు భద్రతా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్ర మంలో అదనపు ఎస్పీ సురేందర్ రావు, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డీఎస్పీ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు సునీల్ కుమార్, కర్ర స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, మురళి, చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.