24-10-2025 11:16:24 PM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం దృష్ట్యా జిల్లాలో చేపట్టిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంలో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జి జిల్లా విద్యాధికారి దీపక్ తివారి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్, ఇతర అధికారులతో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, మండల విద్యాధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రోగ్రాం మేనేజర్లు, పంచాయితీ కార్యదర్శులు, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సదరం యు.డి.ఐ.డి., ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకం పనులు, పేరెంట్స్ కమిటీ సమావేశాలు, గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇంచార్జి జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.
సదరం శిబిరాల ద్వారా అర్హత కలిగిన దివ్యాంగులకు యు.డి.ఐ.డి. గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలిపారు. నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో లబ్ధిదారులు నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని, త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు వేగవంతం చేయాలని, గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలలో తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తూ విద్యార్థులు చదువులో రాణించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారుఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.