calender_icon.png 16 September, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెంట్రలైజ్డ్ టెండర్‌లో మతలబేంటి?

22-07-2024 02:02:07 AM

గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వింత పోకడ  

గిరిజన గురుకులాలు, హాస్టళ్లు, పాఠశాలలకు సరుకుల సరఫరా టెండర్‌పై సర్వత్రా విమర్శలు 

80 కోట్ల టెండర్‌కు 100 కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు 

బిడ్ దాఖలు చేసే వ్యక్తి 60 లక్షల ఈఎండీ చెల్లించాలని కండిషన్ 

గతంలో జిల్లాల వారీగా టెండర్ల ఆహ్వానం 

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా ఒకే కంపెనీకి అప్పచెప్పాలనే ప్లాన్ ?

ఓ బీఆర్‌ఎస్ నేతకు అనుకూలంగా చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి!

హైదరాబాద్, జూలై 21(విజయక్రాంతి) : రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలకు సరుకుల సరఫరాకు నిర్వహించే టెండర్లలో గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ వింత పోకడ అనుసరిస్తున్నదని విమర్శలు వస్తున్నాయి. గతంలో జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించే పద్ధతికి స్వస్తి పలికి ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలిచేందుకు సన్నద్ధమవుతున్నది.

అందులోనూ పెడుతున్న వింత షరతులు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. సాధారణంగా టెండర్లు పిలిచినప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే ఎవరు తక్కువ కోట్ చేస్తారో వారికే టెండర్లు అప్పగిస్తారు. కానీ, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ మాత్రం గ్లోబల్ టెండర్ పేరిట కొత్త సంప్రదాయానికి తెరలేపింది. జిల్లాల వారీగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గ్లోబల్ టెండర్ పేరుతో సరుకుల సరఫరాను ఒకరికే అప్పగించాలని నిర్ణయించడం వివాదస్పదం అవుతోంది.  

రాష్ట్రవ్యాప్తంగా 808 గురుకులాలు, పాఠశాలలు

గిరిజన సంక్షేమ శాఖ నేతృత్వంలోని కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా  808 వరకు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ విద్యార్థులకు ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు అంటే 9 నెలలకు కిరాణ సరుకులు (పుడ్ ఐటెమ్స్), కాస్మోటిక్ పరికరాలను అందించేందుకు రూ.75 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు గిరిజన కో ఆపరేటివ్  కార్పొరేషన్ ఆధ్వర్యం లో సెంట్రలైజ్‌డ్ టెండర్ పేరుతో బిడ్‌ను ఆహ్వానించింది.

కాగా, బిడ్‌లో పాల్గొనే కంపెనీలకు కనీసం 3 ఏళ్ల అనుభవం, ఏడాదికి రూ.100 కోట్ల టర్నోవర్ ఉండాలనే షరతు విధించింది. అంతేకాకుండా ఒక బిడ్ దాఖలుకు రూ.60 లక్షల వరకు ఈఎండీ చెల్లిం చాలనే కండిషన్ పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి షరతులతో చిన్న చిన్న కంపెనీలకు, స్థానిక వ్యాపారులు, నిరుద్యోగులకు అవకాశం లేకుండాపోతుందని ఆందో ళన వ్యక్తంచేస్తున్నారు. ఇందులో గిరిజన సంక్షేమ శాఖలోని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితోపాటు గత ప్రభుత్వంలో సివిల్ సప్లయ్ శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ నాయకుడి  ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.   

నాణ్యమైన సరుకుల సరఫరా కష్టం.. 

గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు ఎక్కువగా కొండలు, గుట్టలు, మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 808 గురుకులాలు, హాస్టళ్లలోని 2 లక్షల మంది విద్యార్థులకు ఒక కాంట్రాక్టరే కిరాణ సరుకులు, కాస్మోటిక్స్ సరఫరా చేయడం సాధ్యం కాదని విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్తున్నారు. అంతే కాకుండా టెండర్‌ను ఎవరైనా దక్కించుకుంటే సదరు కాంట్రాక్టర్ జిల్లాల వారీగా సబ్‌కాంట్రాక్ట్‌లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొదటి కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ల లాభాలు చూసుకుని మిగతా డబ్బులతో సరుకులను సరఫరా చేయాల్సి ఉంటుందని, దీంతో విద్యార్థులకు నాసిరకం సరుకులను సప్లయ్ చేసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

నిర్ణయం ప్రభుత్వానిదా? అధికారులదా?

రాష్ట్రంలోని 33 జిల్లాలవారీగా టెండర్లను ఆహ్వానిస్తే చిన్న, మధ్య తరహా కంపెనీలు, చిరు వ్యాపారస్థులతోపాటు హమాలీలు, చిన్న వాహనాదారులు (ట్రాలీ ఆటోలు), రోజు వారి కూలీలకు ఉపాధి దొరుకుతుందన్న వాదన వినిపిస్తోంది. అయితే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సరుకుల పంపిణీ వ్యవహారం పెద్దల నిర్ణయం మేరకే జరిగిందా? లేక అధికారులే  ఈ నిర్ణయాలు తీసుకున్నారా? అన్న విషయంపై సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, హాస్టళ్లలో  జిల్లాల వారీగా టెండర్లు ఆహ్వానించినట్టే.. గిరిజన గురుకులాలు, హాస్టళ్లలోనూ జిల్లాల వారీగా టెండర్లను ఆహ్వానించాలనే డిమాండ్ వినిపిస్తోంది.