calender_icon.png 16 September, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర పద్దుపై తెలంగాణ ఆశలు

22-07-2024 02:00:42 AM

  1. గతేడాది వచ్చిన గ్రాంట్లు 23 శాతమే
  2. ఎఫ్‌ఆర్‌బీఎం ఆంక్షలతో భారీగా తగ్గిన ఆఫ్ బడ్జెట్ రుణాలు
  3. పథకాల అమలుకు బడ్జెటేతర అప్పుల కోసం రాష్ట్రం విజ్ఞప్తి 
  4. కేంద్రం నుంచి భారీగా నిధులను ఆశిస్తున్న రేవంత్ సర్కారు 
  5. రేపు కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫుల్ బడ్జెట్‌ను కేంద్రం మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ అంశాలతో పాటు కొత్త వాటికి నిధులు, పలు వెసులుబాట్లను ఆశిస్తోంది. తెలంగాణ సర్కారు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గతేడాది బడ్జెట్‌లో కేంద్రం నుంచి ఆశించిన గ్రాంట్లు భారీగా తగ్గాయి. కేవలం 23.58 శాతం మాత్రమే వచ్చాయి.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల వల్ల కూడా 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడింది. ఆఫ్-బడ్జెట్ రుణాలపై విధించిన నిబంధనల కారణంగా రాష్ట్రం ఒకప్పటిలా అప్పులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని ఇబ్బందుల నేపథ్యం లో ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని రేవంత్ సర్కారు భావిస్తోంది. అందుకే ఈ ఫుల్ బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుంది.

2 శాతానికి పడిపోయిన రుణాలు

రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం 2022లో ఆంక్షలు విధించింది. బడ్జెట్‌లో చూపించిన రుణాలు కాకుండా.. బడ్జెటేతర అప్పులు ఇష్టమొచ్చినట్టు చేయడానికి లేకుండా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో సవరణలు చేసింది. బడ్జెటేతర రుణాలు జీడీపీలో 3 శాతం మాత్రమే ఉండాలని నిబంధన విధించింది. రాష్ట్ర ప్రభుత్వ హామీతో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న బడ్జేతర రుణాలను వార్షిక పద్దులో భాగంగానే పరిగణిస్తామని కేంద్రం స్పష్టంచేసింది. ఈ క్రమంలోనే గత ప్రభు త్వం చేసిన రూ.35 వేల కోట్లను వార్షిక బడ్జెట్‌లోని రుణంగా కేంద్రం పరిగణించింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి రుణాలను తీసుకుంటే కేంద్రం ప్రోత్సహకాలను అందిస్తుంది. ఈ నిబంధన వచ్చిన తర్వాత  తెలం గాణ బడ్జెటేతర అప్పులు భారీగా తగ్గాయి. 2021-22లో తెలంగాణ ఆఫ్-బడ్జెట్ రుణాలు 30 శాతం ఉంటే.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అవి ఏకంగా 2 శాతానికి పడిపోయాయి. అయితే తెలంగాణ సర్కారుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు చేయడం అనివార్యం. అందుకే బడ్జెటేతర అప్పులు తీసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని కోరుతోంది.

కేంద్ర గ్రాంట్లలో భారీగా కోత

2023-24 బడ్జెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.41,259.17 కోట్లను ఆశించింది. కానీ, గతేడాది కేంద్రం నుంచి వచ్చింది రూ.9729.91కోట్లు మాత్రమే. అంటే 23.58 శాతం మాత్రమే. గతేడాదిలా కాకుండా ఈసారి రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ సర్కారు ఇప్పటికే ప్రధాని మోదీని కలిసి విన్నవించారు. కేంద్రం నుంచి ఆశించిన మేరకు నిధులు రాకపోవడంతో గతేడాది బడ్జెట్‌లో అంచనా వేసిన రాబడికి, వాస్తవ ఆదాయానికి భారీగా తేడా వచ్చింది. గత బడ్జెట్‌లో రెవెన్యూ ఆదాయాన్ని రూ. 2.16 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. కానీ, వాస్తవ రాబడి రూ.1.69 లక్షల కోట్లు మాత్రమే. రాబడి లేకపోవడం వల్ల గతేడాది వ్యయం కూడా అంచనాలను అందుకోలేకపోయింది.

ఈసారి అంచనాల్లో భారీ తేడా ఉండకుండా.. కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలని రేవంత్ సర్కారు చూస్తోంది. రాష్ట్రాల మూలధన  వ్యయానికి అందించే ప్రత్యేక ఆర్ధిక సహాయం పథకం కింద నిధులను పెంచాలని కోరుతుంది. 2023- కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) కింద మొత్తం రూ.4.60 లక్షల కోట్లు కేటాయిస్తే.. తెలంగాణకు కేవలం రూ.6,577 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది జనాభా నిష్పత్తిలో 1.4 శాతం మాత్రమే. సీఎస్‌ఎస్ కేటాయింపులు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలని, సీఎస్‌ఎస్‌కు ఎలాంటి పరిమితులు విధించకుండా నిధులు విడుదల చేయాలని, కేంద్ర ప్రాయోజిత పథకంలో తెలంగాణకు అవసరం లేని పథకాలను తొలగించి, అవసర మైన వాటిని ప్రవేశపెట్టుకునేలా వెలుసుబాటు కల్పించాలని ప్రభుత్వం కోరుతోంది.

తెలంగాణ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్)నుప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీని నిర్మాణానికి నిధుల సమీకరణపై దృష్టి సారించింది. దీనిని రెండు భాగాల్లో 350 కిలోమీటర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.31వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. ఇందులో 161 కిలోమీటర్లు నిర్మించి మొద టి దశ పూర్తికావాలంటే రూ.15 వేల కోట్లు అవసరం అవుతాయి. దీనికి కేంద్రం అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ర్టం ఆశిస్తోంది.

కేంద్రం నుంచి తెలంగాణ ఆశిస్తున్న మరికొన్ని అంశాలు...

  1. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకా రం సెక్షన్ 94 (2) కింద, రాష్ట్రానికి ఏటా రూ.450 కోట్లు రావాల్సి ఉంది. వీటికి సంబంధించి రూ.2,250 ఇంకా విడుదల కాలేదు. వీటిని విడుదల చేయాలి.
  2.  తెలంగాణలోని అన్ని జిల్లాలను వెనుకబడిన ప్రాంతాలుగా ప్రకటించి, తద్వారా ఐదేళ్లపాటు గ్రాంట్లను విడుదల చేయాలి. 
  3.  2014లో తెలంగాణకు మంజూరైన రూ.495.21 కోట్ల సీఎస్‌ఎస్ గ్రాంట్లను కేంద్రం పొరపాటుగా ఏపీకి విడుదల చేసింది. వాటిని తిరిగి తెలంగాణకు        కేటాయించాలి.
  4. ఉపాధిహామీ పథకంపై విధించిన పరిమితులను తొలగించాలి.
  5.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీ య హోదా ఇవ్వాలి.
  6. మూసీ సుందరీకరణ కోసం రూ.1.5 లక్షల కోట్లు అవసరం అవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీనికి అధిక నిధులు కేటాయించాలి. అలాగే మూసీ అభివృద్ధి కోసం రుణాలు తెచ్చుకునేందుకు వెలుసుబాటు కల్పించాలి.
  7. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న చేస్తున్న ముఫ్తీ బిజిలీ యోజన పథకానికి అనుసంధానం చేయాలి.  
  8. తెలంగాణలోని అన్ని కొత్త జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
  9.  ప్రభుత్వ పాఠశాలల నిర్మాణంపై జీఎస్టీని మినహాయించాలి.  
  10.  అదనపు న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్‌ఏ)ను జీఎస్టీ పరిధి నుంచి మినహా యించాలి. 
  11. హైదరాబాద్--కల్వకుర్తి హైవేను నాలుగు లేన్లుగా అప్‌గ్రేడ్ చేయడం
  12.  ఐపీఎస్ క్యాడర్‌పై సమీక్ష
  13. ఐటీఐఆర్ ప్రాజెక్టు
  14.   నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు
  15.  భద్రత సంబంధిత వ్యయం కింద స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల కేంద్ర వాటా 60 శాతం రీయింబర్స్‌మెంట్‌ను రాష్ర్టం ఆశిస్తోంది.
  16. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సైబర్ క్రైమ్‌ల ఆధునీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సహకారం
  17.  ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం
  18. కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్ కో ఫ్యాక్టరీ
  19.  కరీంనగర్, వరంగల్‌లో స్మార్ట్ సిటీ మిషన్ 
  20.   తెలంగాణలో సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటుకు సహకారం
  21.  సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు కొత్త బ్లాకుల కేటాయింపు 
  22.  2014 ఖరీఫ్‌లో అదనపు లెవీ సేకరణ కోసం రూ.1,586 కోట్ల సబ్సిడీ మొత్తం విడుదల
  23. రాష్ట్రాల మూలధన వ్యయానికి సంబంధించిన ప్రత్యేక ఆర్థిక సహాయం పథకాన్ని ఏడాదికి రూ.2.5 లక్షల కోట్లకు పెంచాలి. ఇందులో తెలంగాణకు అధిక ప్రాధాన్యం.
  24.  తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివ ర్సిటీకి సహకారం
  25. రాష్ర్టంలో వసూలు చేస్తున్న మొత్తం పన్నులో సర్‌చార్జీల వాటా 10 శాతం మించకుండా చూడాలి.
  26. 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన 2022 2023 సంవత్సరాలకు సంబంధించి రూ.2,233కోట్లు విడుదల చేయాలి.
  27. 2023-24లో మూడు, నాలుగో త్రైమాసికాలకు సంబంధించి రూ.347 కోట్ల నేషనల్ హెల్త్ మిషన్ నిధుల విడుదల
  28. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం
  29. ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్సీ(ఏఐ) సెంటర్ ఏర్పాటుకు సహకారం
  30.  కల్వకుర్తి నుంచి మాచర్ల వరకు కొత్త రైలు మార్గం
  31.  ప్రస్తుతం రాష్ట్రంలో రూ.80వేల కోట్ల విలువైన 30 రైల్వే ప్రాజెక్టులు సర్వేలు పూర్తయి ఉన్నాయి. వీటిపై దృష్టి సారించాలని కోరుతోంది.