05-10-2025 12:45:59 AM
మంత్రి హరీశ్‌రావును ప్రశ్నించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): పదేళ్లు అధికారంలో ఉండి ఎందు కు సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆస్పత్రులను నిర్మించలేదో హరీశ్‌రావు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారం పోవడానికి ఏడాది ముందు టిమ్స్ హాస్పిటల్స్‌కు టెండర్లు పిలిచారని, తమ ప్రభుత్వం వచ్చాక వీటి నిర్మాణంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తయ్యిందని, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హంగులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు,ఆధునిక ఆపరేషన్ థియేటర్లను నిర్మిస్తున్నామని, అయితే విదేశాల నుంచి వైద్య పరికరాలు రావాల్సి ఉం డటం వల్ల ప్రారంభోత్సవానికి కొంత సమయం పట్టే అవకాశం ఉం దని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు వచ్చేసరికి హరీశ్‌రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయన్నారు.
కొత్తపేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని, ప్రభుత్వాస్పత్రులను పదేళ్ల పాటు గాలికి వదిలేసి ఇప్పుడు తమకు పాఠాలు చెపుతున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పిగంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు బీఆర్‌ఎస్‌ను పట్టించుకోరని తెలిపారు.