21-04-2025 12:35:59 AM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ ఏప్రిల్ 20 (విజయ క్రాంతి) : పట్టణంలోని నడి మధ్యలో ఉన్న ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉండడం ఏంటని అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మహబూబ్ నగర్ పట్టణం లోని జగ్జీవన్ రామ్ నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఆదివారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడా మైదానం వెనుక భాగం లో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు.
ఈ భూమిని చదును చేసి జిల్లా క్రీడా మైదానానికి కేటాయించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ను ఆదేశించా రు. క్రీడా మైదానానికి కేటాయించిన ఈ భూమిలో క్రీడాకారులకు రూమ్ లు నిర్మిద్దామని చెప్పారు. ఈ భూమి చదును చేసిన వెంటనే అందుకు సంబంధించి ప్రభుత్వానికి ప్రణాళిక లు సిద్ధం చేసి పంపిస్తానని తెలిపారు. అనంతరం జగ్జీవన్ రామ్ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యే స్వయంగా ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.
కాలనీలో అత్యవసరమైన సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు , అలాగే కాలనీ లో ఉన్న కమ్యూనిటీ హాల్ పై భాగంలో కాలనీలో ఉన్న విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించు కొనుటకు షెడ్ నిర్మాణానికి ఎస్టిమేట్స్ తయారు చేయాలని కమీషనర్ ను ఆదేశించారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు.
అంతకుముందు ఈస్టర్ పండుగ ను పురస్కరించుకొని కల్వరీ కొండ పైన జరిగిన ఈస్టర్ సూర్యోదయ ఆరాధనకు ఎమ్మెల్యే హాజరై ప్రత్యేకంగా మాట్లాడారు. కల్వరీ కొండ ను దశల వారీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ 10.72 లక్షల జనరల్ ఫండ్ ద్వారా నిర్మించిన సిసి రోడ్ ను , వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.