19-09-2025 12:05:53 AM
వృథాగా పోతున్న నీరు
మహబూబాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన చెరువుల్లో ఒకటిగా పేరుగాంచిన తాళ్లపూసపల్లి పెద్ద చెరువు మత్తడి శిధిలంగా మారింది. మత్తడి ఓవైపు తిరిగిపోయి చెరువులో నీరు వృధాగా పోతోంది. సుమారు 300 ఎకరాలకు పైగా ఆయకట్టు కలిగిన పెద్ద చెరువు మరమ్మత్తుల కోసం గత ప్రభుత్వ హాయంలో మిషన్ కాకతీయ పథకంలో పనులు చేపట్టారు. చెరువు కట్టకు మరమ్మతులు నిర్వహించిన కాంట్రాక్టర్ అప్పట్లో మత్తడి మరమ్మతు పనులు చేపట్టలేదని రైతులు చెబుతున్నారు.
అప్పటినుండి ఇప్పటివరకు మత్తడి నిర్మాణం పనులు అలాగే వదిలేయడం వల్ల నీరంతా దిగువకు వృధాగా పోతుందని చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల మత్తడికి ఓవైపు గండిపడి మరింత నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద చెరువు నీటితో తాళ్ళపూసపల్లి, అన్నారం గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు పంట పొలాలను సాగు చేస్తున్నారు. మత్తడి దెబ్బతిని నీరు వృధాగా పోవడంతో ఆయకట్టుకు చివరి దశలో సాగునీరు అందని పరిస్థితి ఏర్పడనుందని, అధికారులు స్పందించి దెబ్బతిన్న మత్తడికి మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు.