16-05-2025 12:00:00 AM
‘ఆపరేషన్ సిందూర్’తో దేశ రక్షణ బలగాలు చేపట్టిన చర్యలను దేశ ప్రజలకు వివరించడంలో కల్నల్ సోఫియా ఖురేషి, భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ అందరికీ సుపరితులయ్యారు. భారత ప్రభుత్వం ఇద్దరు మహిళా సైనికాధికారులను బ్రీఫింగ్‌కు ఎంచుకోవడాన్ని అంతా అభినందించారు. వారిద్దరి వివరాలను మీడియా కూడా గర్వంగా ప్రజలకు అందించింది.
దేశంలోని అన్ని ప్రాంతాల వారు, మతాలవారు సైన్యానికి నీరాజనాలు పలికిన సందర్భం కనిపించింది. మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి, కన్యర్ విజయ్ షాకు ఇంకో విషయం కూడా కనిపించింది. కల్నర్ సాఫియా ఖురేషి ముస్లిం అని ఆయన కనిపెట్టారు. పాకిస్థాన్‌ను దునుమాడటం, ప్రధాని మోదీని పొగడడంలో గొంతుచించుకున్న ఆయన సోఫియా ఖురేషిపై మాత్రం అభ్యంతరకరమైన వాఖ్యలు చేశారు.
కల్నల్ ఖురేషి ‘ఉగ్రవాదుల సోదరి’ అని కూడా విజయ్ షా నిందించారు. ఒక మంత్రిగా, రాజ్యాంగ పదవిలో వుండి సైనికాధిరిపై నోరుపారేసుకున్న ఆ ప్రబుద్ధిడి వైఖరి గర్హనీయమని అంతా ఖండించారు. విమర్శలు వెల్లువెత్తడంతో రెండు రోజుల తర్వాత విజయ్ షా తీరిగ్గా ఖురేషికి క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్ హైకోర్టు సదరు మంత్రి చేసిన వాఖ్యలను ఉపేక్షించలేదు.
బజారు భాష మాట్లాడిన మంత్రికి తన బాధ్యతలేమిటో తెలియాలికదా.. అని అగ్రహం వ్యక్తం చేసింది. విజయ్ షా వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని, పోలీసులు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో ఆగమేఘాల మీద విజయ్ షా సుప్రీం కోర్టు తలుపుతట్టారు. గురువారం సుప్రీం కోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ముందుకు ఈ కేసు వచ్చింది.
మంత్రిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఇప్పుడు జోక్యం చేసుకోదని స్పష్టంచేశారు. ‘రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో వున్న వ్యక్తి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని ఎవరైనా ఆశిస్తారు. ఇవేం మాటలు? ఒక, మంత్రి ఇలాంటి మాటలు మాడ్లాడటం సమంజసమేనా?’ అని జస్టిన్ గవాయి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటి.. అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు విజయ్ షా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆగ్రహంగా మలుచుకొంది. ‘మోదీ ఉగ్రవాదుపైకి వారి సొంత సోదరినే యుద్ధానికి పంపాడని విజయ్ షా చేసిన వ్యాఖ్యలు కించపరిచేవిగా, సిగ్గుతో తలదిందచే విధంగా ఉన్నాయి.
మధ్యప్రదేశ్ మంత్రి వర్గం నుంచి ఆ మంత్రిని వెంటనే డిస్మిస్ చేయాలి’ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తెగేసి చెప్పారు. ఘనతవహించిన మధ్యప్రదేశ్ పోలీసులు మంత్రిపై తయారు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై కూడా హైకోర్టు మండిపడింది.
ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన మంత్రి నేరమేమీ చేయలేదనట్లుగా ఎఫ్‌ఐఆర్ రూపొందించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశమంతా ఒక్క తాటి పైకి వచ్చిన సందర్భంలో సదరు మంత్రి ‘హిందుత్వ’ పోకడపై భగ్గుమనని వారు లేరు.