30-07-2025 12:36:28 AM
యువ కథానాయిక కల్యాణి ప్రియదర్శన్ ‘హలో’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు తమిళ, మలయాళ భాషలతోపాటు తెలుగులోనూ వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీ షెడ్యూల్స్‌తో కెరీర్‌లో ముందుకు సాగుతోంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘లోకా: చాప్టర్ వన్ చంద్రన్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
దీన్ని మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. సోమవారం దుల్కర్ పుట్టిన రోజు కావటంతో ‘లోకా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన కథానాయకి కల్యాణి ప్రియదర్శన్.. దుల్కర్ సల్మాన్‌ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. “నేను నీకు సోషల్ మీడియాలో కాకుండా వ్యక్తిగతంగానూ నీకు ప్రతి సంవత్సరం ఓ పెద్ద మెసేజ్ పంపుతాను.
కానీ, ఈసారి మన కలల ప్రపంచానికి సంబంధించిన గ్లింప్స్ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. అందుకే ఈ పోస్ట్ రాస్తున్నా. నిజ జీవితంలో, సినీప్రపంచంలో నువ్వు కన్న కల నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గత ఐదేళ్లలో నాకు ఏ సలహా కావాలన్నా తొలి కాల్ నీకే చేస్తున్నా. అంతలా నాకు అండగా నిలబడ్డందుకు కృతజ్ఞతలు. నువ్వు లేకపోయుంటే నేనేమైపోయేదాన్నో నాకే తెలియదు.
ఒక రకంగా చెప్పాలంటే నేను ఒంటరిదాన్ని కాను.. తోడుగా నువ్వుంటావని నాకు తెలుసు” అని భావోద్వేగపూర్వకంగా రాసుకొచ్చింది. సూపర్ ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘లోకా’ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ పోషిస్తుండగా నస్లెన్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డొమినిక్ అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓనమ్ పండుగ కానుకగా తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.