calender_icon.png 30 July, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినారె ఫొటో ఎందుకు పెట్టలేదు?

30-07-2025 12:39:51 AM

  1. పైడి జయరాజ్ ఫొటో ఎందుకు చిన్నగా ఉన్నది?
  2. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణవాదుల ఆందోళన
  3. నిర్మాతల మండలి కార్యదర్శితో వాగ్వాదం
  4. ఆంధ్రా గో బ్యాక్ నినాదాలతో దద్దరిల్లిన ఛాంబర్
  5. పోలీసుల రంగ ప్రవేశంతో సద్దుమణిగిన గొడవ 

సినిమాప్రతినిధి, జూలై 29(విజయక్రాం తి): తెలుగు ఫిలిం ఛాంబర్‌లో మరోమారు తెలంగాణ వాదం వినిపించింది. తెలుగు ఫిలిం నిర్మాతల మండలిలో అనేక మంది సినిమా ప్రముఖుల ఫొటోలను పెట్టినప్పుడు, ఎన్నో గొప్ప పాటలు రాసిన తెలంగాణకు చెందిన సినీ రచయిత సీ నారాయణరెడ్డి ఫొటో ఎందు కు పెట్టలేదని ఛాంబర్ నిర్వాహకులతో తెలంగాణవాదులు వాదనకు దిగారు.

ప్రముఖ నటుడు పైడి జయరాజ్ ఫొటో చాలా చిన్న పరిమాణంలో పెట్టడాన్ని తప్పుపట్టారు. ఫిలిం ఛాంబర్ వద్ద సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నాయకత్వంలో తెలంగాణవాదులు నిర సనకు దిగారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రా గో బ్యాక్’ అన్న నినాదాలతో ఫిలిం ఛాంబర్ దద్దరిల్లింది. ఆంధ్రా గో బ్యాక్.. చంద్రబాబు ఏజెం ట్లు ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ నిర్మాతల మండలి కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు తెలంగాణవాదులు ప్రయత్నించారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌తో గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణవాదులు పోలీస్ స్టేషన్‌కు రావాలని పోలీసు సిబ్బంది కోరడంతో వారిపై పాశం యాదగిరి మండిపడ్డారు.

ఏం తప్పు చేశామని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులనే ఇక్కడికి రప్పించాలంటూ కానిస్టేబుల్‌కు సూచించారు. దీంతో ఫిలిం ఛాంబర్‌కు సీఐ సంతోష్ చేరుకున్నారు. పాశం యాదగిరితో పాటు తెలంగాణ వాదులతో సీఐ మాట్లాడి వారిని శాంతింపజేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. 

ఆందోళనకు కారణం ఏంటంటే?

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సీ నారాయణ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్మాతల మం డలి హాలులో మంగళవారం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో భాగంగా అతిథుల ప్రసంగాలు కొనసాగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో హాలు నుంచి బయటికి వచ్చిన పాశం యాదగిరి కార్యక్రమంలో తాము మాట్లాడేటప్పుడు ఉద్దేశపూర్వకంగానే కరెంటు తీసేశారని నిర్వా హకులతో గొడవకు దిగారు.

అలా ప్రారంభమైన గొడవ చినికిచినికి గాలివానలా తయా రైంది. నిర్వాహకులకు, తెలంగాణవాదులకు మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ సందర్భంగానే నిర్మాతల మండలి కార్యాలయంలో సీ నారాయణ రెడ్డి ఫొటో లేదని తెలంగాణవాదులు గొడవకు దిగారు.

తెలంగాణ వారి పట్ల చులకనగా మాట్లాడితే దాడి చేయడమే కాదు.. ఇక్కడ బతకనీయకుండా చేస్తామంటూ హెచ్చరించారు. చంద్రబాబు ఏజెంట్లు ఇక్కడ ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గొడవలతో సమస్యలు పరిష్కారం కావని, సామరస్యంగా మాట్లాడి పరిష్కరించుకోవాలని సూచించారు.

చులకన భావం పోలేదు: పాశం యాదగిరి 

తెలుగు ఫిలిం ఛాంబర్ బోర్డు వెంటనే తొలగించి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అని పెట్టాలని పాశం యాదగిరి డిమాండ్ చేశా రు. తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులంటే ఆంధ్రాకు చెందిన సినిమా రంగం వాళ్లకు ఇంకా చులకన భావం పోలేదని మండిపడ్డారు. తెలుగు సినిమాకు వందలాది పాటలు రాసిన సీ నారాయణరెడ్డి ఫొటోను ఛాంబర్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

తెలుగు సినిమా పుట్టకముందే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న పైడి జయరాజ్ ఫొటోను ఇంత చిన్నగా పెడతారా? ఆంధ్రా నేపథ్యం నుంచి సినిమాల్లో రాణించినవారి ఫొటోలను మాత్రం చాలా పెద్దగా పెట్టారని విమర్శించా రు.

ఇంతపెద్ద ఛాంబర్‌లో సినిమాలకు ఎన్నో పాటలు రాసిన నారాయణరెడ్డి ఫొటో లేకపోవడం అన్యాయమని, తెలంగాణ కవులను ఎంత చులకనగా చూస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మాట్లాడుతుంటే కావాలని కరెంటు కట్ చేయడం, మైక్ ఆపేయడం చేశారని పాశం యాదగిరి ఆరోపించారు.