calender_icon.png 22 January, 2026 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈహెచ్‌ఎస్ అమలెప్పుడు?

22-01-2026 12:00:00 AM

బీఆర్‌ఎస్ హయాంలోనే జీవో విడుదల చేసినా అమలు చేయని వైనం

  1. నేడు, రేపంటూ తాత్సారం 

ఎదురుచూస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు

ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో అందని వైద్యం

రెండేండ్లుగా ఉద్యోగుల హెల్త్ స్కీంను సాగదీస్తున్న సర్కారు

హైదరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. ఈహెచ్‌ఎస్ (ఎంప్లాయీస్ హెల్త్ స్కీం) అమలుకు సంవత్సరాల తరబడిగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఈ స్కీంను వెంటనే అమలు చేసి హెల్త్ కార్డులు జారీ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రస్తుతమున్న హెల్త్ కార్డులతో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నచితకా ఆస్పత్రులు మినహా కార్పొరేట్ ఆస్పత్రుల్లో డబ్బులు కట్టందే వైద్యం దొరకని పరిస్థితి నెలకొంది.

ఈ స్కీంను అమలు చేసి, హెల్త్ కార్డులు జారీ చేసి తమకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ఈహెచ్‌ఎస్ అమలు చేయాలనే డిమాండ్ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చినప్పుడల్లా అధికారులు కేవలం సమీక్షలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వానికి నిజంగా చేయాలనే చిత్తశుద్ధి ఉంటే వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు. 

ఏటా రూ.1400 కోట్ల వరకు....

రాష్ర్టంలో 7,14,300 మంది వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. ఈ పథకం కోసం ఏటా రూ. 1,300 నుంచి రూ.1400 ఖర్చు అవుతుందని అధికారులు అంచనా కూడా వేశారు. ఇందులో సగం వాటా ఉద్యోగులది కాగా, మిగిలిన సగం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఉదాహారణకు నెలకు ఉద్యోగి రూ.500 ఈహెచ్‌ఎస్ స్కీం కోసం చెల్లిస్తే, ప్రభుత్వం కూడా అంతే మొత్తం జమచేయాల్సి ఉంటుంది.

ఉద్యోగులు తమ వంతుగా వాటాగా రూ.వెయ్యి ఇచ్చేందుకైనా సిద్ధంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాము కూడా ఇస్తామని అంటోంది. ఇలా సమకూర్చిన రెండు వాటాలను ఈహెచ్‌ఎస్ ట్రస్టులో జమ చేస్తారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులివ్వడం ద్వారా వారి వైద్యానికి కావాల్సిన బిల్లులు ఈ ట్రస్టు నుంచి చెల్లింపులు జరుగుతాయి. దీంతో ఉద్యోగులకు క్యాష్‌లెస్ వైద్యం అందుతుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘం నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ ఈహెచ్‌ఎస్ స్కీం మాత్రం అమలు జరగడంలేదు. 

జీవో అప్పుడే జారీ 

ఉద్యోగ, ఉపాధ్యాయులు సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈహెచ్‌ఎస్ స్కీం అమలుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో- నె.ం186ను అప్పుడే జారీచేసి ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో దానికి బ్రేక్ పడింది. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే హెల్త్‌కార్డులు జారీ చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు.

అయితే కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేండ్లు గడుస్తున్నా నేడు రేపు అంటూ దాటవేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఇక ఈ సర్కారు చేయాల్సింది.. కేవలం ఉద్యోగులు, సర్కారు వాటాను జమ చేయడం, హెల్త్ కార్డులివ్వడం మాత్రమే మిగిలింది.

ఉద్యోగ ఉపాధ్యాయులు ఆందోళనకు పిలుపిచ్చినప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపి త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చికూడా మూడు నాలుగు నెలలవుతోంది. అయినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మాత్రం హెల్త్ కార్డులు జారీ చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఈహెచ్‌ఎస్ స్కీంను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.