26-11-2025 12:00:00 AM
స్థానిక ఓట్ల కోసమే పథకాలు ఇస్తున్నారని ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు
సిద్దిపేట కలెక్టరేట్,నవంబర్:25 సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీరహిత రుణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు.బతుకమ్మ పండగ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం కోటి 30 వేల మహిళలకు చీరలు ఇచ్చిందని, కానీ ప్రస్తుత ప్రభుత్వం 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు మాత్రమే చీరలు ఇస్తోందని విమర్శించారు.
సిద్దిపేటలో 3.83 లక్షల మహిళల్లో 1.99 లక్షల మందికే చీరలు అందించడాన్ని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 వాగ్దానం నెరవేరలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళా సంఘాలు తీసుకునే 25 వేల కోట్లలో 5 వేల కోట్లకే వడ్డీరహిత రుణం ఇస్తున్న ప్రభుత్వం 20 పైసలు ఇచ్చి 80 పైసలు ఎగబెడుతోంది అని అన్నారు. స్త్రీనిధికి వడ్డీరహిత రుణాలు నిలిపివేయడాన్నీ తప్పుపట్టారు. ఆర్టీసీ బస్సులు,1000 మెగావాట్ల సోలార్ పవర్ హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.
కేసీఆర్ పండుగకు పథకాలు ఇస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓట్లకోసం పథకాలు ఇస్తున్నారు అని ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ,ఎక్కడైనా పండుగ వాతావరణం నెలకొందంటె అది మహిళలతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే జిల్లాలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడం జరిగిందని,ఇప్పుడు వడ్డీ లేని రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఆర్డీఓ సదానందం, అడిషనల్ డిఆర్డిఓ, ఫాక్స్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.