24-07-2025 12:00:00 AM
పదకొండు నిమిషాల వ్యవధిలో ఏడు బాంబు పేలుళ్లు.. ముంబై రైళ్లలో 2006 జూలై 11న జరిగిన బీభత్సం ఇంకా కళ్లెదుటే వుం ది. ముంబై స్థానిక సబర్బన్ రైళ్లలో బాంబు పేబుళ్ల ధాటికి ఏడు కోచ్‌లు చిన్నాభిన్నమయ్యాయి. ఆనాటి ఘటనలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు. 824 మంది గాయాలపాలయ్యారు. సబర్బన్ రైళ్లలో సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేవారితో కోచ్‌లన్నీ కిటకిటలాడుతుంటాయి.
ముష్కరులు ఆ సమయాన్నే ఎంచుకుని బాంబులు పేల్చారు. దేశాన్ని గగుర్పొడితే విధంగా భయానకంగా జరిగిన ఈ బాంబు పేలుళ్ల కేసును మహారాష్ర్ట ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) విచారణకు చేపట్టింది. చివరికి 19 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత నిందితులు 12 మందిని బాంబే హైకోర్టు నిర్దోషులని తేల్చింది. మరి ఇంత బీభత్సానికి వ్యూహం పన్నిందెవరు? బాంబులు పెట్టిందెవరు? పోలీసుల దర్యాప్తులో ఇంతకాలం సాధించిందేమిటి?
అనే ప్రశ్నలు బాధిత కుటుంబాలను కలిచివేస్తున్నాయి. నిర్దోషులుగా తేలిన వారిని కేసు విచారణ పేరిట దాదాపు 17 ఏళ్లు చిత్రహింసలకు గురిచేసిన ట్లే కదా.. వారికి ఈ 17 ఏళ్ల సుదీర్ఘ కాలాన్ని ఎవరివ్వగలరు? అనే ప్రశ్నలు ముంబై పోలీసుల వైపు వేలెత్తి చూపుతున్నాయి. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు మహారాష్ట్ర తెచ్చిన చట్టం (ఎమ్‌సీఓసీఏ) కింద ప్రత్యేక కోర్టు గతంలో విచారణ జరిపి 12 మందిని దోషులుగా తేల్చి వారిలో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
తర్వాత ఈ కేసు ముంబై హైకోర్టుకు వెళ్లింది. కేసు దర్యాప్తులో అనేక లొసుగులున్నాయని, వాంగ్మూలాల సేకరణ బలవంత పెట్టి చేసినట్టుగా, తప్పుడు వాంగ్మూలాలు వున్నాయని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలు కూడా సరిగా లేవని తన తీర్పులో పేర్కొంది. ఇది కింది కోర్టు తీర్పును బుట్టలో పడేయడమే కాదు, కేసు దర్యాప్తు జరిగిన తీరు, సాక్షుల విచారణ విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టినట్టయింది.
కింది కోర్టులో, బాంబు పేలుళ్లు జరిగిన తొమ్మిదేళ్లకు 2015లో తీర్పు వెలువడింది. ఆ తర్వాత దశాబ్దకాలం అనేక విచారణలు, అప్పీళ్ల తర్వాత తుది తీర్పు నిందితులంతా నిర్దోషులేనని తేల్చివేసింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఈ కేసు కొలిక్కిరావాలంటే ఇంక ఎంతకాలం పడుతుందో వేచిచూడాల్సిందే. ఈ కేసులో నిందితులకు నిజంగానే సంబంధం లేకుంటే, వారు ఇంకెంతకాలం శారీరకంగా, మానసికంగా మగ్గిపోవాలని ప్రజా సంఘాలు పోలీసులను ప్రశ్నిస్తున్నాయి. మొదట ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తాము సేకరించిన అనుమానితుల జాబితాలో ‘ఇండియన్ ముజాహిదీన్’
ఈ పేలుళ్లకు కారణంగా పేర్కొన్నారు. ఆ తర్వాత కేసు విచారణ కొనసాగించిన యాంటీ టెర్రర్ స్క్వాడ్, స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్, లష్కరే తయిబాలతో లింకు ఉన్నట్లు సాక్ష్యాధారాలను పేర్కొంది. వీటిపై ముంబై పోలీసులు తగిన ఆధారాలను హైకోర్టుకు చూపలేకపోయారు. ముంబై వాసులకు, దేశానికి ఉగ్రరూపం చూపిన ముష్కరులను కోర్టు ఎదుట నిలిపి, బాధితులకు సరైన న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ముంబై పోలీసులపైనే ఉంది.