28-10-2024 12:00:00 AM
విజయక్రాంతి, ఖేల్ విభాగం : స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమి టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. బంగ్లాదేశ్‌పై దూకు డుగా ఆడి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఆటలు కివీస్ ముందు మాత్రం సాగలేదు.
స్పిన్‌తో ప్రత్యర్థిని దెబ్బ తీయాలని భావించిన టీమిండియా చివరకు అదే స్పిన్ ఉచ్చులో చిక్కుకొని బొక్క బోర్లా పడింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాకా గౌతమ్ గంభీర్‌కు స్వదేశంలో కివీస్‌తో సిరీస్ ఓటమితో తొలి ఎదురుదెబ్బ తగిలింది.
దీంతో గంభీర్ ముందు గా జట్టును ట్రాక్‌లో పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. రెస్ట్ పేరుతో కోహ్లీ, రోహిత్, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన గంభీర్ ఇకపై ఆ చాన్స్ ఇవ్వకపోవచ్చు. రానున్న ఆసీస్ టెస్టు సిరీస్ గంభీర్‌కు మరింత సవాల్‌గా మారనుంది.
తక్కువ అంచనా వేశారా?
భారత గడ్డపై అడుగుపెట్టడానికి ముందు న్యూజిలాండ్ ఆట గొప్పగా ఏం సాగలేదు. శ్రీలంక చేతిలో 0-2తో చిత్తుగా ఓడిన న్యూజిలాండ్ ఘోర అవమానంతో ఇండియాకు వచ్చింది. జట్టులో సౌథీ, టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ మినహా మిగతావారెవరికి భారత్‌లో టెస్టులు ఆడిన అనుభవం లేదు. తప్పు ఎక్కడ జరిగింది అన్నది ఆరా తీస్తే.. కివీస్‌ను మన టీమిండియా తక్కువ అంచనా వేసింది.
పైగా గతంలో 12 సందర్భాల్లో భారత్‌లో టెస్టులు ఆడేందుకు వచ్చిన కివీస్ ఒట్టి చేతులతోనే స్వదేశానికి వెళ్లింది. కివీస్‌ను అలవోకగా ఓడిస్తాములే అన్న మన అతివిశ్వాసం పూర్తిగా దెబ్బ కొట్టిం ది. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి భారత్‌ను చాన్నాళ్లు వెంటాడే అవకాశముంది. ఎందుకంటే వరు సగా రెండు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడిన జట్టు నుంచి ఇలాంటి ప్రదర్శన రావడం మింగుడు పడని అంశం.
వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో మొదలుకానున్న బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్‌లో ఇలాంటి ఆటతో టీమిండియా నుంచి మంచి ప్రదర్శన ఆశించడం అత్యాశే అవుతుంది. అజింక్యా రహానే, చతేశ్వర్ పుజా రా.. కొన్నేళ్ల పాటు భారత టెస్టు క్రికెట్ విజయాల్లో ఇద్దరు కీలకపాత్ర పోషించారు. ఆసీస్‌తో సిరీస్‌కు ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకోవలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరు రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన ఇస్తున్న సంగతి తెలిసిందే.
రోహిత్ విఫలం
ఇక కెప్టెన్‌గా.. ఆటగాడిగా రోహిత్ శర్మ పూర్తిగా విఫలమవ్వడం ఆందోళనకరం. న్యూజిలాండ్‌తో సిరీస్ ఓటమి కంటే సొంతగడ్డపై 12 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ను కోల్పోవడం అభిమానులను మరింత బాధించింది. బౌలింగ్ విభాగం పర్వాలేదనిపించినప్పటికీ బ్యాటింగ్ వైఫల్యం కొంపముంచింది.
స్పిన్‌ను బాగా ఆడగల సత్తా ఉన్న స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పూర్తిగా ఫెయిలవ్వడం.. గిల్, కేఎల్ రాహుల్, పంత్‌లు నిర్లక్ష్య రహితంగా ఆడడం భారత్‌ను మరింత కష్టాల్లో పడేసింది. భారత్‌లో టెస్టులు అంటే పోటాపోటీగా వికెట్లు పడగొట్టే అశ్విన్, జడేజాలు అటు బౌలింగ్‌లో.. ఇటు బ్యాటింగ్‌లో పూర్తిగా తేలిపోయారు.