14-05-2025 12:14:00 AM
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రుల పనులు ఆలస్యమవడంపై ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నాళ్లు ఈ నిర్మాణ పనులు కొనసాగిస్తారంటూ అధికారులను ఆయన నిలదీశారు. దవాఖాన కట్టించడమంటే పేదోడికి గుడి కట్టించినట్టు భావించాలని, కానీ వాస్తవంగా ఆ పరిస్థితి కనిపించడం లేదున్నారు.
మంగళవారం సచివాలయంలో టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాల పురోగతిపై మంత్రి సమీక్షించారు. నత్తనడకన పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు, పర్యవేక్షిస్తున్న అధికారుల తీరును కోమటిరెడ్డి ఎండగట్టారు. జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇంకా పనులు పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే తేదీని ఖరారు చేసినా, ఈ ఆలస్యమేంటని నిలదీశారు.
టిమ్స్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటి వరకు టిమ్స్ ఆసుపత్రుల పనులు పూర్తి చేస్తారో అంచనా వేసి నివేదిక ఇవ్వాలన్నారు.
టిమ్స్ ఆసుపత్రుల పనుల పురోగతిపై ఇకపై ప్రతీవారం సమీక్షించనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇతర అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.