31-10-2025 12:00:00 AM
-గేట్ల నుంచి లీకేజీలు..
-వెదురు కర్రలే.. రక్షణ గోడలు
-శిథిలావస్థలో అతిథిగృహం
-పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
నకిరేకల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటైన మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణకు నోచుకోక అంధకారంలో కొట్టుమిట్టాడుతుంది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మూసీ ప్రాజెక్టు పరిస్థితి ఉంది. సోలిపేట గ్రామం వద్ద మూసీనదిపై 1954 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 1963 సంవత్సరంలో పూర్తి చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన ఐదేళ్ల వరకు ఎడమ కాలువ 41 కిలోమీ టర్లు, కుడికాలువ 38 కిలోమీటర్ల పొడవున మొత్తం 42 గ్రామాల రైతులకు సాగునీరందించింది.
ప్రస్తుతం ప్రాజెక్టులో పూడిక పెరిగిపోవడంతో 30 వేల ఎకరాలకు ఆయకట్టుకు పడిపోయింది. పాలకులు మారుతున్న మూసీ ప్రాజెక్టు పై నిర్లక్ష్యం మాత్రం వీడటం లేదు. ప్రాజెక్టు మీద నిర్మించిన రక్షణ గోడలకు రక్షణ లేకుండా పోయింది.. వెదురు కర్రలేదిక్కయ్యాయి. పర్యాటకులతో, అతిధులతో కిటకిటాడాల్సిన అతిథిగృహం శిధిలావస్థలో ఉంది. క్లస్టర్ గేట్ల నుండి ,ప్రాజెక్టు రక్షణ గోడల నుండి నుండి నీరు లీకేజ్ అవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారు.
ఈ ప్రాజెక్టుపై ఆరుగురు పర్మనెంట్ ఉద్యోగులు, నలు గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కేటాయించే నిధులు సరిపోక మరమ్మతులు పూర్తి స్థాయిలో జరగటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉమ్మడి జిల్లా మంత్రులు మూసీ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి పెట్టి ఆధునీకరణకు పూనుకొని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.
తగ్గిన ఆయకట్టు
మూసి ప్రాజెక్ట్ 6700 ఎకరాలలో విస్తరించి ఉంది 4.46 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్ట్ రోజురోజుకు పూడిక పెరగడంతో సామర్థ్య స్థాయి తగ్గిపోతుంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో నకిరేకల్, సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడెo నియోజకవర్గాలకు సాగునీరు అందుతుంది.కుడి కాల్వ పరిధిలో కేతేపల్లి, మాడ్గులపల్లి, తిప్పర్తి, వేములపల్లి మండలాల్లో 23 చెరువులు, ఎడమ కాలువ పరిధిలో సూర్యాపేట, చివ్వెంల, పెన్ పహాడ్ మండలాల్లో 22 చెరువులు ఉన్నాయి. కాలువలకు నీటిని విడుదల చేసి నట్లయితే చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండుతాయి. కుడి, ఎడమ కాల్వల కు నీటిని విడుదల చేస్తే ఆయకట్టు పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల ఎకరాల భూము లు సాగులోకి రానున్నాయి.
రక్షణ గోడలకు కర్రలే దిక్కు
ప్రాజెక్టు మీద ఇరువైపులా నిర్మించిన రక్షణ గోడలు శిథిలవస్థకు చేరాయి. రక్షణ గోడలకు మరమ్మత్తులు చేపట్టలేదు. రక్షణ గోడలు శిథిలమైన స్థానంలో కర్రలు కట్టి మమ అనిపించారు. ప్రాజెక్టు కు సందర్శకులు వచ్చినప్పుడు వారు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వెదురు కర్రలు విరిగే ప్రమాదం ఉంది.
గేట్ల లీకేజీలపై నిర్లక్ష్యం ఎందుకు
మూసీ ప్రాజెక్టుకు 30 స్కవర్, క్రష్, రెగ్యులేటర్ గేట్లు ఉన్నాయి. వీటిలో 10 స్కవర్ గేట్లను శాశ్వతంగా మూసివేశారు. ఎనిమిది క్రష్ గేట్లలో మూడు గేట్ల నుండి నీరు లీకేజీ రూపంలో వాగులోకి వెళ్తుంది. దశాబ్దన్నర కాలంగా గేట్ల నుంచి నీరు లీకేజి అవుతున్న మరమ్మతులకు నోచుకోలేదు. మూసీ ప్రాజెక్టు డ్యాం గేట్లు ముగిసిన తర్వాత ఉన్న ప్రాంతంలో డ్యాం గోడల నుంచి సైతం నీరు లీకేజీల రూపంలో ప్రవహిస్తుంది. ఈ లీకేజీలు సంవత్సరాల తరబడి అవుతున్న పట్టించుకోవడం లేదు. లీకేజీల వెంబడి చెట్లు పెరిగి ఆ గోడను మరింత బలహీన పరుస్తున్న పరిస్థితి ఉంది.
అంధకారంలో అతిథిగృహం
గతంలో పర్యాటకులు, అతిధులతో కలకలలాడిన అతిథి గృహం నేడు వెలవెలబోతుంది. అతిథి గృహానికి మరమ్మత్తులు లేక శిధిలవస్థకు చేరుతుంది. అతిథి గృహం, గేట్లకు కలర్స్, ఇతర మరమ్మతుల కోసం రూ.4 కోట్ల తో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. డ్యాం రక్షణ, మరమ్మతుల కోసం రూ. 75 లక్షలతో ప్రభుత్వం నుండి సాంక్షన్ ఆర్డర్స్ వచ్చాయి కానీ సాంక్షన్ ఆర్డర్స్ వచ్చిన టెండర్లకు ఎవరు ముందుకు రాలేదని త్వరలో మళ్లీ టెండర్ వేసి మరమ్మతులు చేపడతామని ప్రాజెక్టు డి ఈ చంద్రశేఖర్ తెలిపారు.
పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి
ఉమ్మడి జిల్లాలో రెండో ప్రాజెక్ట్ అయిన మూసి ప్రాజెక్టును పర్యటకేంద్రంగా అభివృద్ధి చేయడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఆహ్లాదకర వాతావరణం, పర్యాటకుల సందడి, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, చుట్టుపక్కల ప్రకృతి అందాలు పర్యాటక కేంద్ర అభివృద్ధికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం స్పందించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.