16-08-2024 12:00:00 AM
ప్రజలను విపత్తు నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ఆస్తుల రక్షణ, నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ నూతన స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటుచేసింది. అన్ని శాఖల సమన్వయంతో విపత్తుల నిర్వహణసహా ఆక్రమణలను కట్టడి చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజన్సీ (హైడ్రా) పేరుతో ఏర్పాటైన ఈ సంస్థ విధివిధానాలతో ప్రభుత్వం ఓ జీవోను విడుదల చేసింది. దాని ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2 వేల చ.కి.మీల విస్తీర్ణంలో హైడ్రా విధులు నిర్వర్తిస్తుంది.
దీనికి ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉంటారు. అఖిలభారత సర్వీసుకు చెందిన కార్యదర్శి లేదా అంతకు మించి హోదా కలిగిన అధికారి కమిషనర్‌గా ఉంటారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ర్యాంకులోని ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను హైడ్రాకు కమిషనర్‌గా నియమించింది. జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని ప్రాంతాలకు విపత్తుల రక్షణ కల్పనకు హైడ్రా సమగ్రమైన ప్రణాళికను రూపొందించాలి. జాతీయ స్థాయి విపత్తు స్పందన బృందాలు (ఎన్డీఆర్‌ఎఫ్), వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీలను సమన్వయంతో, వాతావరణ సమాచారాన్ని పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలి. విపత్తు స్పందన బృందాలను ఏర్పాటు చేసుకోవాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ, లేదా స్థానిక సంస్థల పరిధిలోని పార్కులు, లేఔట్ల ఖాళీ స్థలాలు, పరిశ్రమల శాఖ స్థలాలు, చెరువులు, కుంటలు వంటి జలవనరుల ఆక్రమణలపై వచ్చే ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల ఉల్లంఘన, శిథిల భవనాలు, పౌరుల భద్రతకోసం ప్రైవేటు ఆస్తులనూ పరిశీలించే అధికారం ఈ సంస్థకు ఉంటుంది. నగర పరిధిలో రద్దీని తగ్గించడానికి, రోడ్లపై గోతులు, ముప్పు మార్గాలు, ముంపునకు గురైన కాలనీలపై కలెక్టర్లు, స్థానిక అధికారులు, పోలీసులు, ఇతర శాఖల సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకొంటుంది.
హైడ్రా ఏర్పాటు వెనుక విస్తృతమైన లక్ష్యం ఉంది. వివిధ శాఖలమధ్య సమన్వయం లేక, లంచాలకు మరిగిన అధికారుల పుణ్యమా అని చెరువులు, కుంటలు, నాలాలు అన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. ఫలితంగా వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు చెరువులు, నాలాలు పొంగి పొర్లి కాలనీలు, ఊళ్లను ముంచేస్తున్నాయి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవలసిన అధికారులు నెపాన్ని ఇతర అధికారులపై నెట్టివేస్తుండడంతో సమస్య పరిష్కారం అటుంచి మరింత జటిలమవుతున్నది.
హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాల్లో ఈ ఆక్రమణల సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నగరంలో కబ్జా స్థలాల్లోని నిర్మాణాలపై హైడ్రా మొదటి రోజునుంచే కొరడా ఝళిపించింది. అక్రమ నిర్మాణాలపై ఆ సంస్థ ఒక్కసారిగా విరుచుకు పడడంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వారికి అండగా ఉన్న రాజకీయ నేతలు ఈ చర్యలపై మండి పడుతున్నారు. ఓ ప్రజాప్రతినిధి అయితే బహిరంగంగానే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ హైడ్రా జాగీరు కాదన్న రీతిలో మాట్లాడారు.
అయినా, హైడ్రా దూకుడు ఆగలేదు. ఇది జరిగిన 24 గంటలకే పాతబస్తీ హసన్‌నగర్ కింగ్ కాలనీలో చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. బిల్డింగులను కూల్చివేయడాన్ని అడ్డుకోబోయిన బహదూర్‌పురా మజ్లిస్ ఎమ్మెల్యేసహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా నిర్మితమైన 13 బహుళ అంతస్థుల భవనాలు, 40 కాంపౌండ్ వాల్స్‌ను కూల్చేశారు. హైడ్రా తీరుతో బెంబేలెత్తిన రాజకీయ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి యత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి, ఈ దూకుడు ఇలాగే కొనసాగి కబ్జాలకు శాశ్వతంగా తెరపడాలని కోరుకుందాం.