16-08-2024 12:00:00 AM
పాఠశాలల సమూహం నాణ్యమైన విద్యను విశ్వసిస్తుంది. ఇది కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాని కొత్త రకమైంది. శారీరక, మానసిక, మేధోపరమైన కోణంలో అభ్యాసకుడికి సర్వతోముఖాభి వృద్ధిని కలిగించేది. ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు పదునుగా, మరింత గ్రహణశక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి, సమూహ విద్యార్థుల మానసిక కోణాన్ని సుసంపన్నం చేయడానికి అనేక కార్యకలాపాలు దోహదపడతాయి. అయితే, అటువంటి నాణ్యమైన విద్య మన చిన్నారులకు అందని ద్రాక్షగానే ఉంది. పాఠశాల విద్యపై ప్రభుత్వాల పట్టింపు లేనితనంతో విద్యా ప్రమాణాలు క్షీణిస్తున్నాయని ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన పనితీరు గ్రేడింగ్ సూచికల నివేదిక తేటతెల్లం చేసింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు బాగా పడిపోయాయి. సర్కారు బడుల్లో విద్యార్థుల నమోదు అంతకంతకూ తగ్గుతున్నది. జాతి భవిత తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. నాణ్యమైన విద్య అందరికీ అందినప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై అధికంగా నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉంది. చాలా సంవత్సరాలకు పైగా ‘యాక్షన్ ఎడ్యుకేషన్’ అనేది అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, ప్రధానంగా బలహీన, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నది.
ఈ మేరకు కార్పొరేట్‌కు దీటుగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తుండడంతో పేద విద్యార్థులు ఉన్నత స్థానాలు అధిరోహిస్తున్నారని విద్యావేత్తలు అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖలో సమూల మార్పులు జరగాలి. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించేలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్‌లో మార్పులు చేయాలి. ప్రైవేటు విద్యాసంస్థలతో ప్రభుత్వ స్కూళ్లు పోటీ పడేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఏటా ప్రతిభా అవార్డులు అందించి ప్రోత్సాహించాలి.అప్పుడే చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.
మోటె చిరంజీవి