calender_icon.png 14 September, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమరయోధుల స్ఫూర్తితో ఉన్నామా?

15-08-2024 12:00:00 AM

నేడు స్వాతంత్య్ర దినోత్సవం :

భారతదేశం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని  జరుపుకుంటున్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. ‘వికసిత్ భారత్ 2047’ అనేది స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరమైన 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఇచ్చిన నినాదం. ‘వికసిత్ భారత్’ ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన సహా ప్రగతికి సంబంధించిన అన్ని అంశాల దృష్టితో కూడుకున్నది.

ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు వారి ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్య్ర సమరయోధుల స్వేచ్చ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి కలలను మనం ఎంతవరకు సాధించాం? ఏ దేశ సంక్షేమమైనా పౌరుడి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఇన్నేళ్ల భారతదేశ పాలకులు తన పౌరుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచిందా?

తగ్గని పేదరిక భారం

సుమారు 3.937 ట్రిలియన్ల డాలర్ల (రూ.4 లక్షల కోట్లు) స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం 2023-- తలసరి వార్షిక ఆదాయం రూ.2.12 లక్షలు. కానీ, ఇప్పటికీ దేశం పేదరికంతో బాధ పడుతున్నది. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగా నే ఉంది. 2023 ‘ప్రపంచ ఆకలి సూచీ’ ప్రకారం 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. భారత ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించే కేంద్రం (సీఎంఐఈ) ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు 2024 మేలో 7 శాతం నుండి జూన్ నాటికి 9.2 శాతానికి పెరిగింది. మరోవైపు ఒక శాతం జనాభా సంపద వాటా 2022 సుమారు 40.1 శాతంగా ఉంది.

దేశంలోని పొదుపులో 92 శాతం సొమ్ము సంపన్నులైన 20 శాతం మంది చేతుల్లోనే ఉంది. వీటితోపాటు 2023లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ ‘కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్’ ప్రకారం 100కి 40 శాతం అవినీతి భారంతో భారతదేశం ఉంది. దేశం 2023 నాటికి తన స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 3--4 శాతం విద్యపై ఖర్చు చేసింది. ఆరోగ్య సంరక్షణపై 1.2---1.5 శాతం వెచ్చించింది. మానవాభివృద్ధి- సంబంధిత ప్రాంతాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6-8 శాతంగా అంచనా వేయబడింది. అయితే, ఇది వార్షిక బడ్జెట్ కేటాయింపులు, విధాన మార్పుల ఆధారంగా మారవచ్చు. 

సరళీకృత ఆర్థిక వ్యవస్థలో ‘రెడ్ టేపిజం’ ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతున్నది. బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తున్నది. అయితే, ఇది వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, వినోద రంగాలలో మరింత ఎక్కువగా ఆచరణలో ఉంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వరకట్నం, ఆడశిశు హత్యలు, లింగ అసమానత, గృహహింస, అంటరానితనం మొదలైన సాంఘిక దురాచారాలు కొనసాగుతూనే  ఉన్నాయి.

పలు రంగాల్లో గణనీయ అభివృద్ధి

మన దేశం ఎన్ని ఆటంకాలు ఎదురైనా విభిన్న రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో, మొబైల్ వినియోగంలో, వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచ వ్యాప్తంగా 2వ ర్యాంక్, బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, ప్రపంచ ఉత్పాదకత, రోదసీ రంగాల్లో ఐదో స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంలో 8వ ర్యాంక్ స్థానంలో ఉంది. దేశం ప్రపంచంలోనే 14వ అతిపెద్ద ఎగుమతిదారు. మన దేశం సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐటీ, పరిశ్రమల పోటీ తత్వంలో 18వ ర్యాంక్, హ్యాపీ ప్లానెట్ ఇండెక్స్‌లో 30వ ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానాన్ని నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రం గాలలో ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి.

జీవన పరిస్థితులు మెరుగుపడాలి

సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన వేదికలు, చట్టాల గురించి తెలుసుకోవాలి. పౌరుల జీవన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయి. అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలపై అవగాహన ఉన్న పౌరుల భాగస్వామ్యంతోనే స్వా తంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని పొందాలి. అప్పుడే దేశం మరింత వేగవంతమైన ప్రగతిని నమోదు చేయగలుగుతుంది. ఆ దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.

 డాక్టర్. పి. ఎస్.చారి

త్యాగమూర్తులకు వందనాలు

కుల మత వర్గ విచక్షణ లేకుండా సమిష్టిగా భారతీయులమంతా జరుపుకునే జెండా పండుగ నేడు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో పిల్లలు నాటికలు, నృత్యాలతో, పాటలతో వేడుక జరుపుతారు. దేశ నాయకుల వేషధారణతో వారిని అనుకరిస్త్తూ పిల్లలు చేసే అభినయం ప్రశంసనీయం. ‘స్వాతంత్య్ర దినోత్సవం’ అంటే చాలామందికి బాల్యం గుర్తొస్తుంది. తాము చదువుకున్న పాఠశాలలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొనడం అంటేనే అత్యంత ఉత్సాహకర సందర్భం. త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక ఉజ్వల భావోద్వేగ శక్తి అలుముకుంటుంది. దేశం పట్ల గర్వంతో నిండిన మనసులతో మువ్వన్నెల జెండాకు గౌరవ వందనం చేస్తాం. జాతీయ గీతాన్ని హృదయపూర్వకంగా ఆలపిస్తాం.

వాతావరణంలో దేశభక్తి అలుముకొనేలా అద్భుతమైన పాటలు, స్కూళ్లలో పంచే పిప్పర్మెంట్లు. గాలికి రెపరెపలాడే జెండా వెనుక ఎందరో మహనీయుల త్యాగం ఉంది. ఈనాడు మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే అది వారు ప్రసాదించిందే. తెల్లదొరలు భారతీయులను నీచాతినీచంగా చూసి తమ పబ్బం గడుపుకొన్నారు. కొందరు మన భారతీయులే వారికి తందానా పాడారు. వారి డబ్బులకు అమ్ముడుపోయి ఆత్మాభిమానం చంపుకున్నారు. ఆ రోజుల్లో  ప్రతి భారతీయుడు మొక్కవోని ధైర్యంతో తెల్లదొరలను ఎదురించాడు. భారతీయుల ఐక్యత చూసి బెంబేలెత్తిన బ్రిటీష్ వారు మనలో మనకే కొట్లాట పెట్టాలని చూశారు. 

అయితే, విజ్ఞత కలిగిన భారతీయులు బ్రిటిష్ వారి ఎత్తుగడలను చిత్తు చేసి ధైర్యంతో పోరాడారు. సామాన్యులు సైతం పోరు కు నడుం బిగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. మహాత్మాగాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా సత్యాహింసలనే ఆయుధాలుగా పోరాటం సాగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వాతంత్య్రం సంపాదించింది. ‘క్విట్ ఇండియా’ పోరు బ్రిటిష్ వారిని గడగడ లాడించింది.

దేశం మొత్తం గాంధీ వెంట నడిచింది. ఉవ్వెత్తున ఎగిసిన కెరటాలవలె వచ్చిన ప్రజా చైతన్యాన్ని చూసి బ్రిటిష్ సైన్యం బిత్తరపోయింది. భారతీయుల అసమాన పోరాటం ముందు బ్రిటిష్ ప్రభుత్వం తల వంచింది. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్య్ర పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. ఈ 77 ఏళ్లలో దేశం సాంస్కృతికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో ప్రగతిని సాధించింది. ఇవాళ వారం దరిని తలుచుకుంటూ, అమరుల పోరాట పంథాను గుర్తుకు చేసుకుంటూ, ఆ త్యాగమూర్తులకు వందనం సమర్పిద్దాం. భారత పతా కం రెపరెపలాడుతుంటే ఆ జెండాను చూస్తూ దేశ స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి మనకు స్వేచ్ఛను ప్రసాదించిన ఆ త్యాగమూర్తులకు సెల్యూట్ చేద్దాం.

లకావత్ చిరంజీవి