28-01-2026 12:00:00 AM
ప్రపంచకప్‌కు ముందు పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపుతూ న్యూజిలాండ్‌పై సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు రిజర్వ్ బెంచ్ పై ఫోకస్ పెట్టింది. విశాఖ వేదికగా జరిగే నాలుగో టీ ట్వంటీలో కీలక ఆటగాళ్లకు రొటేషన్ పద్ధతిలో విశ్రాంతినిచ్చే ఛాన్సుంది.దీంతో బెంకే పరిమితమైన శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులోకి రానుండగా..సంజూ శాంసన్‌కు మరొక అవకాశం లభించనుంది. మరోవైపు భారత్ జోరును అడ్డుకుని పరువు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్న కివీస్ ఎంత వరకూ పోటీనిస్తుందో చూడాలి.
విశాఖపట్నం, జనవరి 27 : టీ20 ఫార్మాట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న భారత్ ఇప్పుడు కివీస్ పై నాలుగో మ్యాచ్‌కు సిద్ధమైంది. బుధవారం విశాఖపట్నం వేదికగా జరిగే మ్యాచ్‌లోనూ గెలిచి ఆధిక్యాన్ని 4-0 కు పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ గెలవడంతో మిగిలిన రెండు టీ ట్వంటీల్లో రిజర్వ్ బెంచ్ ప్లేయర్స్ కు అవకాశం ఇవ్వనున్నారు.
దీంతో తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. మరో 10 రోజుల్లో ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో వర్క్ లోడ్ మేనేజ్ మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం ఖాయమైంది. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా , హర్షిత్ రాణా ఉన్నట్టు తెలుస్తోంది. బుమ్రాకు ఈ సిరీస్ లో ఇప్పటికే ఒక మ్యాచ్ నుంచి రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడు సిరీస్ ఫలితం తేలిపోవడంతో మరో మ్యాచ్ కు కూడా విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ బుమ్రాను కొనసాగించనుకుంటే మాత్రం హర్షిత్ రాణాకు రెస్ట్ ఇవ్వొచ్చు.
అప్పుడు అతని స్థానంలో అర్షదీప్ సింగ్ జట్టులోకి వస్తాడు. రెండో టీ ట్వంటీలో అర్షదీప్ భారీగా పరుగులిచ్చేశాడు. దీంతో తన లైన్ అండ్ లెంగ్త్ అందుకునేందుకు అతనికి ఈ మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. అలాగే ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇస్తారని భావిస్తున్నారు. పాండ్యా స్థానంలో శ్రేయాస్ అయ్యర్ జట్టులోకి వచ్చే ఛాన్సుంది. తిలక్ వర్మ ఇంకా ఫిట్‌నెస్ సాధించకపోవడంతో శ్రేయాస్ ను చివరి 2 టీ ట్వంటీలకు కూడా బీసీసీఐ కొనసాగిస్తోంది. అటు మూడో టీ20కి తప్పించిన వరుణ్ చక్రవర్తీ జట్టులోకి వస్తే రవి బిష్ణోయ్‌నే తప్పించాల్సి ఉంటుంది.
కానీ మూడో టీ ట్వంటీలో బిష్ణోయ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ దృష్ట్యా వరుణ్ ను రెస్ట్ మోడ్‌లోనే ఉంచే అవకాశముంది. ఈ మార్పులు త్పపిస్తే మిగిలిన జట్టంతా యథావిధిగా ఉండనుంది. ఈ క్రమంలో ఓపెనర్ సంజూ శాంసన్‌కు మరో అవకాశం ఇవ్వనున్నారు. నిజానికి ఈ సిరీస్‌లో ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ సంజూ నిరా శపరిచాడు. బ్యాటింగ్ పిచ్‌లపై కూడా అతను విఫలమవుతుండడంతో టీమ్ మేనేట్ మెంట్ కు ఆందోళన కలిగిస్తోంది. మెగాటోర్నీకి సంజూపై చాలా అంచనాలున్నాయి.
దీంతో ఈ సిరీస్ చివరి రెండు మ్యాచ్‌ల్లోనైనా సంజూ శాంసన్ ఫామ్ అందుకోవాలని మేనేజ్ మెంట్ కోరుకుంటోంది. ఒకవేళ అతను వైఫల్యాల బాట వీడకుంటే మాత్రం ప్రపంచకప్ తుది జట్టులో ఇషాన్ కిషన్‌కే ప్రాధాన్యత దక్కొచ్చు. ఎందుకంటే ఇషాన్ తనకిచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు సిరీస్ కోల్పోయినప్పటకీ మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి పరువు దక్కించుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. దీని కోసం జట్టులో మార్పులు కూడా చేసింది.
పిచ్ రిపోర్ట్: విశాఖ పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకే అనుకూలం. ఇక్కడ భారీస్కోర్లు నమోదవుతుంటాయి. సెకండాఫ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషించే అవకాశమున్నప్పటకీ ఛేజింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అభిమానులకు పరుగుల పండుగే.
తుది జట్లు అంచనా: భారత్ : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, బుమ్రా
న్యూజిలాండ్: టిమ్ సిఫర్ట్, కాన్వే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, చాప్‌మన్, జిమ్మీ నీషమ్, మిఛెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ఇష్ సోధి