29-10-2025 12:10:11 AM
-నేడు ఆస్ట్రేలియాతో తొలి టీ20
-శుభారంభం కోసం ఇరు జట్ల ఆరాటం
- భారత తుది జట్టు కూర్పుపై సస్పెన్స్
కాన్‌బెర్రా, అక్టోబర్ 28 : భారత్, ఆస్ట్రేలియా ఏ ఫార్మాట్‌లో తలపడినా ఎంట ర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు. గత వారం వన్డే ఫార్మాట్‌లో అలరించిన రెండు జట్లు ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అందించబోతున్నాయి. అభిమానులు ఎక్కువగా ఇష్టపడే పొట్టి క్రికెట్‌లో రెండు టాప్ టీమ్స్ తలపడితే ఇక వారికి పండగే. ఐదు మ్యాచ్‌ల టీ ట్వంటీ సిరీస్‌లో తొలి పోరు కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరగబోతోంది.
యువ, సీనియర్ ఆటగాళ్ళతో సమతూకంగా ఉన్న ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. గత ఏడాది ప్రపంచకప్ గెలిచిన తర్వాత అదే జోరు కొనసాగిస్తూ పొట్టి క్రికెట్‌లో టీమిండియా దుమ్మురేపుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్ నుంచే సన్నాహాలు మొదలుపెట్టనుంది.
ఎందుకంటే జట్టు కూర్పును సెట్ చేసుకోవడానికి ఆసీస్ లాంటి ప్రత్యర్థే సరైనదిగా చెప్పాలి. పైగా వన్డే సిరీస్ ఓటమికి ప్రతీ కారం తీర్చుకోవాలన్న పట్టుదలతో భారత్ కనిపిస్తోంది. ఇటీవల ఆసియాకప్‌లో భారత్ ఎలాంటి ఆటతీరుతో టైటిల్ గెలిచిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఆసీస్ గడ్డపైనా అదే పెర్ఫార్మెన్స్‌తో చెలరేగేందుకు ఎదురుచూ స్తోంది. టీ20 ఫార్మాట్ అంటే చెలరేగిపోయే పలువురు ప్లేయర్స్ జట్టులో ఉండడంతో సహజంగానే టీమిండియా ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. ఆసియాకప్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ, మ్యాచ్ విన్నర్ తిలక్ వర్మ, ఫినిషర్ శివమ్ దూబేలతో పాటు బౌలింగ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్టులు బుమ్రా, అర్షదీప్, స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇలా ఏ విధంగా చూసినా పటిష్టంగా కనిపిస్తోంది.
అయితే తుది జట్టు కూర్పే కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సవాల్‌గా మారింది. బ్యాటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. బౌలింగ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవడం కాస్త ఛాలెంజ్‌గానే మిగిలిందని చెప్పాలి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌తో పాటు మరో స్పిన్నర్‌గా కుల్దీప్ లేదా వరుణ్ చక్రవర్తిలలో ఒకరికే చోటు దక్కనుంది. ఇద్దరూ అద్భుతమైన బౌలర్లే కావడంతో ఎవరిని తీసుకుంటారనేది చూడాలి. అలాగే పేస్ విభాగంలో స్టార్ బౌల ర్ బుమ్రాతో పాటు అర్షదీప్‌సింగ్ కూడా జట్టులో ఉంటాడు. అయితే మరో పేసర్‌గా హర్షిత్ రాణాకు అవకాశం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సిడ్నీ వన్డేలో సత్తా చాటిన హర్షిత్ రాణాను తీసుకోవాలనుకుంటే శివమ్ దూబేను తప్పించాల్సి ఉంటుంది.
మరోవైపు ఆస్ట్రేలియా కూడా భీకరంగానే ఉంది. టీ20 స్పెషలిస్టులతో బరిలోకి దిగుతున్న కంగారూలను భారత్‌కు చెక్ పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఓపెనర్ల నుంచి 8వ నంబర్ బ్యాటర్ వరకూ అందరూ హిట్టర్లుగానే చెప్పొచ్చు. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడే షార్ట్, హెడ్, మార్ష్ మాత్రమే కాదు మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే టిమ్ డేవిడ్, స్టోయినిస్ లాంటి ఆల్‌రౌండర్లు ఆసీస్‌కు పెద్ద బలం. బౌలింగ్‌లో స్టార్క్ లేకున్నా హ్యాజిల్‌వుడ్, ఎబోట్, నాథన్ ఎల్లిస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే వికెట్ కీపర్ జోష్ ఫిలిప్ చాలా రోజుల తర్వాత జట్టులో రావడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చే అంశం.
గత రికార్డులు :
టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయిగా ఉంది. ఈ ఫార్మాట్‌లో ఎప్పటి నుంచే ఆధిపత్యం కనబరుస్తున్న భారత్ ఇప్పటి వరకూ కంగారూలతో 32 మ్యాచ్‌లలో తలపడింది. వీటిలో టీమిండియా 20 మ్యాచ్ లు గెలిస్తే... ఆస్ట్రేలియా 11 విజయాలకే పరిమితమైంది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
పిచ్ రిపోర్ట్ ః
మ్యాచ్ జరిగే కాన్‌బెర్రాలో చాలా చల్లటి వాతావరణం ఉంది. సాధారణంగా ఇది లో స్కోరింగ్ గ్రౌండ్. బిగ్‌బాష్ లీగ్‌లోనూ చాలా సార్లు తక్కువ స్కోర్లే నమోదయ్యాయి. బౌండరీలు పెద్దగా ఉండడం స్పిన్నర్లకు అడ్వాంటేజ్. ఇక్కడ మొదట బ్యాటింగ్‌కు దిగిన జట్లు 10 సార్లు, ఛేజింగ్ టీమ్స్ 9 సార్లు గెలిచాయి.
తుది జట్లు అంచనా ః
భారత్ : అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(కీపర్), రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి/కుల్దీప్ యాదవ్,హర్షిత్ రాణా/శివమ్ దూబే, బుమ్రా, అర్షదీప్
ఆస్ట్రేలియా : మార్ష్(కెప్టెన్), హెడ్, ఇంగ్లీస్(కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మిఛ్ ఓవెన్, స్టోయినిస్, సీన్ అబోట్‌ట/బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, కున్నేమన్, హ్యాజిల్‌వుడ్