22-11-2025 01:04:50 AM
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ2’. 14 రీల్స్ ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రామ్ అచంట, గోపీచంద్ అచంట, ఇషాన్ సక్సెనా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్. ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషిస్తుండగా, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం బెంగుళూరులో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
బాలకృష్ణ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ముఖ్యంగా శివతత్వాన్ని చాటిచెప్పేలా రూపొందిన అఘోర పాత్రలో బాలకృష్ణ అలరించారు. తల్లీ కొడుకుల మధ్య సెంటిమెంట్, భావోద్వేగాలను ఆవిష్కరించిన తీరు మెప్పించింది. విలన్‌గా ఆది పినిశెట్టి లుక్ భయానకంగా ఉంది. ‘ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా అక్కడ కనిపించేది ఒక మతం, కానీ ఈ దేశంలో ఎక్కడైనా కనిపించేది ఒక ధర్మం.. సనాతన హైంధవ ధర్మం’, ‘దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేం ఖండిస్తాం, మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ర్టైక్.
మా దేవుడితో పెట్టుకోవడానికి మీకు ఎంత ధైర్యం, ఇప్పటివరకు ప్రపంచ పటంలో నా దేశం రూపాన్ని మాత్రమే చూసి ఉంటావ్, ఎప్పుడూ నా దేశం విశ్వరూపాన్ని చూసి ఉండవు. మేం ఒక్కసారి లేచి శబ్దం చేస్తే, ఈ ప్రపంచమే నిశ్శబ్దం’ అంటూ బాలకృష్ణతో చెప్పించిన డైలాగులు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: సీ రాంప్రసాద్, సంతోష్ దేట్కే; ఎడిటర్: తమ్మిరాజు.