01-11-2025 12:00:00 AM
మిర్యాలగూడ, అక్టోబర్ 31 విజయ క్రాంతి:- ఉబ్బసం వ్యాధికి చికిత్స కోసం వచ్చిన మహిళ సకాలంలో వైద్యం అందక మృతి చెందిన ఘటన శుక్రవారం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో జరిగింది. వైద్యుడి నిర్లక్ష్యం వలన మహిళ మృతి చెందిందంటూ ఆరోపిస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ మండలం ములకల కాల్వకు చెందిన నాగిళ్ల వెంకమ్మ దగ్గు, జ్వరం,ఆయాసం తో చికిత్స నిమిత్తం తన కుమారుడు ప్రదీప్ ని తీసుకొని 8గంటల సమయంలో ఏరియా ఆసుపత్రికి వచ్చిందని, డ్యూటీ డాక్టర్ నెహ్రూ 9:30 గంటలకు డ్యూటీ నుంచి దిగిపోయేంతవరకు వెంకమ్మకు వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు.
దీంతో ఆమెకు ఆయాసం ఎక్కువైపోయి ఊపిరి ఆడని పరిస్థితుల్లో డ్యూటీ కి వచ్చిన డాక్టర్ ఫాతిమా ఆక్సిజన్ పెట్టాలంటూ సిబ్బందికి పురమాయించారని అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడంతో ఆయాసం ఎక్కువయ్యి ఊపిరాడని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతుండగా కుమారుడు వెళ్లి డాక్టర్కు పరిస్థితిని వివరించగా హడావుడిగా వచ్చిన డాక్టర్ ఫాతిమా ఆక్సిజన్ ఎందుకు పెట్టలేదు అంటూ సిబ్బందిని మందలించి, అప్పటికప్పుడు ఆక్సిజన్ పెట్టారన్నారు. అప్పటికే పరిస్థితి చేయి జారిపోవడంతో ఆక్సిజన్ పెట్టిన 15 నిమిషాలకే మహిళ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సకాలంలో వైద్యం అందక వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని డాక్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. తల్లి మృతితో ఒంటరైన ప్రదీప్ ను ప్రభుత్వం ఆదుకోవాలని, నిరుపేదైన అతని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని,ప్రభుత్వం ఉచిత చదువులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమైక్య నియోజకవర్గ అధ్యక్షురాలు దాసర్ల దుర్గమ్మ, వెంకన్న, రాము, సోమయ్య, ఎల్లమ్మ, బుజ్జి, కవిత,ఏడుకొండలు రాంబాబు తదితరులు ఉన్నారు.