26-11-2025 12:00:00 AM
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, నవంబర్ 25: వడ్డీలేని రుణాలు సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. ఇబ్రహీంపట్నంలో శాస్త్ర గార్డెన్లో మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పలు మండలాల తహసీల్దార్లు, అధికారులతో కలిసి 3,508 స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.4 కోట్ల 43 వేల 782 చెక్కులను ఎంపీ చామల కిరణ్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ అధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మహిళలు వ్యాపారం, ఇతర రంగాల్లో రాణించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తోందని వెల్లడించారు.
మహిళల సంక్షేమం దృష్ట్యా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీలేని రుణాల పథకం సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చామల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కె.గురునాథ్ రెడ్డి, ఆర్డీవో అనంత రెడ్డి పాల్గొన్నారు.