22-08-2025 11:50:16 PM
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
సిర్పూర్ యు(విజయక్రాంతి): గ్రామస్థాయి నుండి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జైనూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో పనుల జాతర లో భాగంగా ఉపాధి హామీ పథకం క్రింద ఇంకుడు గుంత కొరకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో అభివృద్ధి పనులను వేగవతం చేయాలని తెలిపారు. మండలంలోని జామిని గ్రామపంచాయతీ పరిధిలో పనుల జాతర లో ఉపాధి హామీ పథకం క్రింద పశువుల పాకను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. సిర్పూర్ - యు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యారంగ అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే గుణాత్మక విద్య బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. మండలంలోని పాములవాడ గ్రామపంచాయతీ పరిధిలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కోళ్ల ఫారంను ప్రారంభించినట్లు తెలిపారు. తెలంగాణ ఆదర్శ పాఠశాలలు సందర్శించి విద్యార్థుల హాజరు పట్టిక, విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు.
పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణానికి భూమి పూజ చేశారు. జిల్లాలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.